Nizamabad | కోతుల బెడదకు చెక్..

Nizamabad | కోతుల బెడదకు చెక్..
- వినూత్న ప్రయోగం చేపట్టిన సర్పంచ్…
Nizamabad | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఒక ఆసక్తికరమైన ఘటన మంగళవారం వెలుగు చూసింది. గత కొంతకాలంగా ఈ గ్రామంలో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వానర మూకలు ఇళ్లపై పడి ఆహార పదార్థాలను ఎత్తు కెళ్లడమే కాకుండా.. చిన్న పిల్లలు,వృద్ధుల పై దాడులు చేస్తూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.గ్రామంలో కోతుల బెడద తీవ్రం కావడంతో..ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ ఒక వినూత్న ప్రయోగం చేసి ప్రజల ప్రశంసలు పొందారు.
ఎలుగుబంటి వేషధారణలను ధరించిన వారితో గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ కోతులను తరిమికొట్టారు. ఎలుగు బంటిని చూసి భయపడిన కోతులు పారిపోతున్నాయి. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ కోతులను భయపెట్టి గ్రామాన్ని, పంటలను రక్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎలుగుబంటి వేషధారణలో ఉన్న వ్యక్తిని చూసి కోతులు భయపడి పారిపోతున్నాయని అన్నారు. ఈ వినూత్న ప్రయోగం ద్వారా కోతుల సమస్యకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రయోగాన్ని చేపట్టామని తెలిపారు.

ఈ ప్రయత్నం ద్వారా కోతుల నుండి విముక్తిని కలిగించడమే కాకుండా, గ్రామాల్లో కోతుల దాడులను అరికడతామని అన్నారు. ఈ వినూత్న ప్రయత్నానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏనుగందుల గంగాజమున గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
