NITI Aayog| మరి కొద్దిసేపట్లో నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీ

న్యూ ఢిల్లీ : ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

వికసిత్ రాజ్య, వికసిత్ భారత్-2047″ ఇతివృత్తం (థీమ్)గా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కానుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి రెండు తెలుగు రాష్ట్రాల ముుఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.కాగా, 2018 తర్వాత తొలిసారిగా జరిగే నీతిఆయోగ్ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ హాజరవుతున్నారు.

రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదిక

వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ ఎజెండాగా ఏర్పాటు చేసిన నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదల్చుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదిక రేవంత్ రెడ్డి సమర్పించ నున్నారు.

తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్‌తో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్‌లో ముందున్న తెలంగాణ ఆయా రంగాల్లో మరింత ముందుకు పోయేందుకు ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సమావేశంలో వివరించనున్నారు.

యూనివర్సిటీల ఏర్పాటుపై ప్రసంగించనున్న సిఎంఆర్‌ఆర్‌ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటిఆర్‌లుగా మారుస్తూ మౌలిక వసతులు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో యూనివర్సిటీల ఏర్పాటుపై సిఎం ప్రసంగించ నున్నారు.

సాగు రంగం అభివృద్ధికి చేసిన రుణమాఫీ, వరికి బోనస్, సంక్షేమంలో భాగంగా అందిస్తున్న సన్న బియ్యం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500లకే సిలిండర్ సరఫరాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. సామాజిక సాధికారితలో భాగంగా ఎస్సీ కులాల ఉప వర్గీకరణ, కుల గణన, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు.

Leave a Reply