Nipah Virus | కేర‌ళ‌లో నిఫా వైరస్ క‌ల‌క‌లం…చికిత్స పొందుతూ యువ‌తి మృతి

చికిత్స పొందుతూ యువ‌తి మృతి
అప్ర‌మ‌త్త‌మైన కేర‌ళ స‌ర్కార్
యువ‌తి చికిత్స అందించిన 43 మంది
అంద‌ర్ని క్వారంటైన్ కి పంపిన వైద్య శాఖ
మ‌రో మ‌హిళ‌కు సైతం నిఫా ఎటాక్

తిరువ‌నంత‌పురం – కేరళలో (kerala ) ప్రాణాంతక నిఫా వైరస్ (Nipah virus ) మళ్లీ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఓ యువతి మృతి (women died ) చెందింది. మరొకరు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే, మలప్పురం జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని నిఫా బారిన పడి ఈ నెల ఒక‌టో తేదిన‌ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెను కొట్టక్కల్‌లోని ఆసుపత్రికి తీసుకురాగా, అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో, పాలక్కాడ్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ కూడా ఇదే వైరస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. వీరిద్దరి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, నిఫా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈ పరిణామంతో కేరళ ఆరోగ్య శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో హైఅలర్ట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా, మరణించిన యువతికి చికిత్స అందించిన 43 మంది ఆరోగ్య సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు.

నిఫా అనేది జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఇది సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు మెదడువాపు (ఎన్‌సెఫలైటిస్) లేదా తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటిగా పరిగణిస్తోంది.

Leave a Reply