తారు రోడ్డుకు 1.39 కోట్ల నిధులు…

తారు రోడ్డుకు 1.39 కోట్ల నిధులు…
పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ఎన్‌హెచ్–65 నుండి ముళ్లపాడు గ్రామం వరకు గతుకులతో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డును పునర్నిర్మించేందుకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కృషితో మొత్తం 1 కోటి నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి. ఎన్‌హెచ్–65 నుండి ముళ్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర ఒక లేయర్ తారు రోడ్డు యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా ముళ్లపాడు నుండి మక్కపేట వరకు 12 కిలోమీటర్ల మేర తారు రోడ్డుకు ప్యాచ్‌వర్క్ పనుల కోసం 39 లక్షలు మంజూరు చేయబడగా, ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభమయ్యే పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల సందర్భంగా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడం పట్ల భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే తాతయ్య కి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తెలిపారు. ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడం ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాలకు ఊతమిచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు అవుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్య, మాజీ జెడ్పిటిసి గజ్జి కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుధీర్ బాబు, టీడీపీ నాయకులు వెల్ది అప్పారావు, ఐలపోగు వెంకటేశ్వర్లు, రోడ్డు సూపర్‌వైజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
