- మరో ఘనతకు నిర్వాహకుల శ్రీకారం.
- గిన్నిస్ రికార్డు ప్రయత్నం
- 3 వేల మంది కళాకారుల కార్నివాల్..
- అతిథులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : దసరా ఉత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ సారధ్యంలో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. విజయదశమి పండుగ శోభను దేశ, విదేశాల్లో చాటిచెప్పేలా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాలన్న మహోన్నత లక్ష్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక కార్నివాల్‌కు శ్రీకారం చుట్టారు.
3 వేల మంది కళాకారులతో భారీ ప్రదర్శన..
విజయవాడ ఉత్సవ్ లో భాగంగా దసరా పర్వదినం అక్టోబర్ 2వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విజయవాడ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమయ్యే ఈ కార్నివాల్, బెంజి సర్కిల్ వరకు వైభవంగా సాగనుంది.
నాసిక్ డోలు, కాళికా వేషాలు, పోతురాజులు, లంబాడి సాంప్రదాయ నృత్యం, గుస్సాడి, కేరళ డ్రమ్స్, కర్ర సాము, తీన్మార్, సన్నాయి మేళం, కథాకళి, స్టిక్ వాకర్స్, పగటి వేషాలు, వీరనాట్యం, గరగరలు, కొమ్ముకోయ, దింసా, తప్పిటగుళ్ళు, వీరాగాసలు, బేబీ నాట్యం, చెక్కభజనలు, పులివేషాలు, కోలాటం, గారడి, యక్ష కళలు, బేతాళ సెట్టు, అఘోరాలు, గొరిల్లా డాన్స్ లు, డప్పు వాయిద్యాలు వంటి దసరా వేషధారణలో 3 వేల మంది కళాకారులు పాల్గొని, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయనున్నారు. కళ, సాంస్కృతిక వైభవం సమ్మేళనంగా జరగనున్న ఈ ప్రదర్శన జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారనుంది.
అమ్మవారి రథోత్సవం ప్రధాన ఆకర్షణ…
ఈ కార్నివాల్‌లో ప్రధాన ఆకర్షణగా ప్రత్యేకంగా రూపొందించిన రథంపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. మంగళవాయిద్యాలు, బృందాల నృత్యాలు, సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక విన్యాసాలు ఈ ఊరేగింపుకు ప్రత్యేక కాంతి నింపనున్నాయి. ఇది విజయవాడ దసరా మహోత్సవాలకు మరింత గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా, ప్రజల్లో భక్తి, ఆనందాలను కలగలిపే మహోత్సవ క్షణాలుగా నిలవనుంది.
ముఖ్య అతిథుల రాకతో మరింత వైభవం…
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. వారిద్దరి సాన్నిధ్యం ఈ మహోత్సవానికి మరింత మహిమాన్వితమైన శోభను తీసుకురానుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమం నగరవాసుల భాగస్వామ్యం, కళాకారుల ప్రదర్శన అన్నీ కలిసొచ్చి విజయవాడకు చిరస్మరణీయ ఘట్టాన్ని అందించనున్నాయి.
విజయవాడను ప్రపంచ దృష్టిలో నిలపాలని లక్ష్యం….
విజయవాడ ఉత్సవ్ లో భాగంగా జరగబోయే ఈ గిన్నిస్ రికార్డు ప్రయత్నం విజయవాడను కళలు, సంస్కృతి, భక్తి, సంప్రదాయాల పటముపై విశిష్టంగా నిలబెట్టనుంది. దసరా అంటే విజయవాడ అనే బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేయడమే ఈ విశేష కార్యక్రమం వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యం.