ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: నేపాల్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కొత్త జెండా (Flag) ఒకటి వెలుగులోకి వచ్చింది. మామూలు రాజకీయ/నిరసనల జెండాలకు బదులుగా, నేపాల్ యువత జపాన్‌కి చెందిన ప్రసిద్ధ యానిమే (Anime) ‘వన్ పీస్’లోని స్ట్రా హ్యాట్ పైరేట్స్ జెండాను ఎగురవేశారు. ఇది యువత పోరాటానికి కొత్త గుర్తింపుగా మారింది.
సోషల్ మీడియా నిషేధం, నిరసనలకు నాంది

నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించడంతో యువతలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. ఈ నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ, దేశంలో అప్పటికే రాజుకున్న అవినీతి, రాజకీయ అస్థిరత, ఆర్థిక ఇబ్బందులకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమయ్యాయి.
రాజధాని కాఠ్మాండూ వీధుల్లో “భ్రష్ట రాజకీయాలపై తిరుగుబాటు” నినాదాలు, టైర్లు దహనం వంటి తీవ్ర నిరసనల మధ్య, ఈ ప్రత్యేకమైన జెండా అందరి దృష్టిని ఆకర్షించింది.
‘పైరేట్స్’ ఒక కొత్త నిర్వచనం

సాధారణంగా పైరేట్స్ అంటే దోపిడీ, దౌర్జన్యాలు గుర్తుకొస్తాయి. అయితే, ‘వన్ పీస్’లోని స్ట్రా హ్యాట్ పైరేట్స్ దీనికి భిన్నంగా ఉంటారు.
ఆ అనిమే సిరీస్ లోని మెయిన్ క్యారెక్టర్ లూఫీ తన క్రూతో కలిసి పైరేట్స్ కింగ్ గా మారేందుకు ప్రయాణం మొదలుపెడతాడు. ఆ మార్గంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఆ అడ్డంకులను తొలగించే క్రమంలో, ప్రభుత్వ దౌర్జన్యాల వల్ల బాధపడుతున్న ప్రజలకు కూడా సహాయం చేస్తారు. అన్యాయం జరిగినప్పుడు అవినీతి పాలనపై తిరుగుబాటు చేస్తారు, అణచివేతకు గురైన వారిని రక్షిస్తారు.
ఈ ఆదర్శాలను నేపాల్ యువత తమ ఉద్యమానికి స్ఫూర్తిగా తీసుకుంది. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ దేశాన్ని రక్షించుకోవాలనే సంకల్పంతో ఈ జెండాను ఎగురవేశారు.
రాజకీయ నేతలకు “డెడ్ ఆర్ అలైవ్” ట్యాగ్
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల అభిమానులను సంపాదించిన వన్ పీస్ సిరీస్‌లోని జాలీ రోర్జర్ ఫ్లాగ్ తో పాటు “Wanted Posters”ను, నేపాల్ యువత తనదైన రీతిలో ఉపయోగించింది.

ప్రధాన నాయకులు— ప్రచండ, శేరే, కే.పీ. ఒలీ లాంటి వారి చిత్రాలు, వన్ పీస్ యానిమే స్టైల్ “Dead or Alive” పోస్టర్ల మాదిరిగా తయారు చేసి వీధుల్లో ప్రదర్శించారు. అందులో ఉన్న బౌంటీ (డబ్బు) అంకెలు నిజం కాదు, కానీ వ్యంగ్యాత్మకంగా అవినీతిపై ప్రజల ఆగ్రహాన్ని చూపించడమే ఉద్దేశ్యం. యువత ఆగ్రహాన్ని, రాజకీయ నాయకులపై వ్యతిరేకతను వ్యక్తపరచడానికి అనిమే భాష, పాపులర్ కల్చర్ రూపకాలను వాడుతున్నారు.
యువత కొత్త మార్గంసాంప్రదాయ రాజకీయ చిహ్నాలు, జెండాలకు బదులుగా, అనిమే సింబల్స్‌ను ఎంచుకొని “తమ తరం కొత్త పోరాటం” అని బలమైన సందేశాన్ని ఇచ్చింది నేపాల్ యువత. వన్ పీస్ అనిమే లోని జాలీ రోర్జర్ అనే ఈ జెండా తమ స్వేచ్ఛ, న్యాయం, అవినీతి లేని భవిష్యత్తు కోసం చేసే పోరాటానికి ప్రతీక అని వారు ప్రకటించారు.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ దృశ్యాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.

ఇది కేవలం అనిమే ఫ్యాన్ కల్చర్ కాదని, ఇది విప్లవానికి, మార్పుకు ఒక కొత్త చిహ్నం అని సోషల్ మీడియాలో అంటునారు. స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఇప్పుడు కేవలం ఒక అనిమే మాత్రమే కాదు… నిజజీవితంలోనూ అన్యాయం పై పోరాడేందుకు నిజమైన విప్లవ చిహ్నంగా మారింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.