దిగుబడిపై ప్రతికూల ప్రభావం

దిగుబడిపై ప్రతికూల ప్రభావం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెల్లబంగారం పంటను నమ్ముకున్న రైతులు తెల్లబోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. నష్టాన్ని వ్యవసాయ శాఖ(Department of Agriculture) కూడా పూర్తి స్థాయిలో అంచనా వేయడం లేదు. రైతులు మాత్రం సాగు చేసిన పంటలో 70 శాతం నష్టపోయినట్లు చెబుతున్నారు. అతిభారీ వర్షాలతో పత్తి పంటకు జరిగిన నష్టంతో దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న పత్తి ధరలు రానున్న రోజులలో పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్‌(Market) వర్గాలు అంచనా వేస్తున్నాయి. పత్తిని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(Cotton Corporation of India)(సీసీఐ) సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలో పత్తి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న జిల్లాల జాబితాలో వికారాబాద్‌ జిల్లా ఒకటి. ఈ ఏడాది జిల్లాలో రైతులు 2.60 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారు.

జిల్లాలో ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మంచి దిగుబడులు.. పంట సాగుకు అనుకూల నేలలు, వాతావరణ పరిస్థితి ఉండడం.. పండించిన పంటకు మార్కెటింగ్‌ ఇబ్బందులు లేకపోవడంతో రైతులు పత్తి పంట సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో విస్తారంగా ఉన్న నల్లరేగడి పొలాలతోపాటు ఇసుక నేలల్లో పత్తి సాగు చేస్తున్నారు. గత ఏడాది జూన్‌లో ప్రారంభమైన పత్తి సాగు చివరి దశకు చేరుకుంది. ముందుగా విత్తుకున్న పొలాల్లో పత్తి పువ్వులను రైతులు సేకరిస్తున్నారు.

ప్రస్తుత సీజన్‌(Current Season)లో సాగు చేసిన పత్తి పంట అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. జూన్‌లో లోటు వర్షపాతం.. జూలై, ఆగస్టు మాసాలలో భారీ వర్షాలు, సెప్టెంబర్‌ మాసంలో అతిభారీ వర్షాలు జిల్లాను ముంచెత్తాయి. జూన్‌ మొదటి నుంచి సెప్టెంబర్‌(September) చివరి వరకు జిల్లాలో 652 మిల్లి మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 922 మిల్లిdమీటర్ల వర్షపాతం నమోదైంది.

వాతావరణ విభాగం సమాచారం ప్రకారం వికారాబాద్‌ జిల్లాలో సాధారణం కంటే 41 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టు..సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన అతిభారీ వర్షాలకు సాగులో ఉన్న పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. ఏపుగా పెరిగిన కాయలతో కూడిన పత్తి పైర్లు అతి భారీ వర్షాలకు నీట మునిగాయి. రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. గత సెప్టెంబర్‌ నెలలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నల్లరేగడి పొలాల్లో సాగు చేస్తున్న పత్తి పంటకు భారీ నష్టం జరిగింది. చాలా గ్రామాలలో సగానికి పైగా పంట దెబ్బతిన్నది.

సరిగ్గా పూత, కాయలు, అప్పుడే విచ్చుకుంటున్నకాయ దశలో ఉన్న పత్తి పంటను అతిభారీ వర్షాలు ముంచెత్తడంతో నష్టం రెట్టింపు అయ్యింది. అతిభారీ వర్షాలకు పత్తి పంట నల్లబారింది. మొత్తంగా వరుణుడి ప్రతాపంతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో పత్తి ధరలు ఆశాజనకంగా ఉంటాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతికి ద్వారాలు తెరవడంతో దేశీయంగా పండించిన పత్తికి డిమాండ్‌ తగ్గి ధరలు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం లేదని వ్యాపార వర్గాలు అంచనా వేశాయి.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత మార్కెటింగ్‌ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాలు(Quintas)కు రూ.8110గా ఖరారు చేసింది. ఈ స్థాయిలో మార్కెట్‌లో ధరలు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే భారీ వర్షాలతో పత్తి పంట పెద్ద ఎత్తున దెబ్బతినడం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడం.. దిగుబడిపై కూడా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. జిల్లాలో క్రితంసారి రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి వచ్చింది.

అతిభారీ వర్షాలతో ఈ సారి ఏమేరకు దిగుబడి తగ్గుతుంది అనేది రైతులు ఆందోళన చెందుతున్నారు. అతిభారీ వర్షాలతో పత్తి పంటకు జరిగిన నష్టంపై మార్కెట్‌ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో పత్తి పంట ధరలు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

Leave a Reply