నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకే..
మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్నీ సర్వేలు హస్తం వైపే వెలువడడమే ఇందుకు తార్కాణమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి నుండి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆయన తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణానగర్ లో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ శాసనసభ్యులు ఇదూలపల్లి శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ నేత అజహరోద్ధిన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎస్.టి కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఏ.ఐ. సి.సి కార్యదర్శి సంపత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత ముదిరాజ్, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు. బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కటంటే ఒక్క తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయలేక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం 20 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు 89 లక్షల నుండి కోటి 15 లక్షలకు తెల్ల రేషన్ కార్డులు పెంచామన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకే 40 వేల తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. యావత్ భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా నిరుపేదలందరికి నాణ్యమైన సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఆయన కొనియాడారు. రాష్ట్ర జనాభాలోని 85 శాతం మంది ఎస్.సి,ఎస్.టి, బి.సి, మైనారిటీ ప్రజలకు సన్న బియ్యం అందించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ప్రజలలో రోజు రోజుకు విశ్వసనీయత పెరుగుతుందని ఆయన చెప్పారు.
నాణ్యమైన సన్న బియ్యంతో 3 కోట్ల 15 లక్షల మంది లబ్ది పొందుతుండగా మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయోజనం పొందుతున్నారన్నారు. అంతే గాకుండా గృహ జ్యోతి పధకంతో అర్హులైన నిరుపేదలందరికి 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అటువంటి సంక్షేమ పధకాలను విస్మరించిన విపక్షాలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారానికి పాల్పడడం విడ్డురంగా ఉందని ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల నేతృత్వంలోనీ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణమైన నమ్మకం కుదిరిందని, ఆ నమ్మకంతోటే ఇక్కడి ప్రజలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర రోడ్డు రవాణా,బి.సి సంక్షేమ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బి.జె.పి,బి.ఆర్.ఎస్ లు ఒక్కటయ్యారని ఆరోపించారు. ఆ రెండు పార్టీల కుట్రలను ఛేదించాడానికి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ఇదే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు విడుదల చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు.

