హైదరాబాద్, ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా షేక్‌పేట, రహమత్‌నగర్ డివిజన్‌లలో జరిగిన కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 30 వేల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నవీన్ గెలిస్తే 4 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు.
ఇక జూబ్లీహిల్స్ సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహ్మద్ అజారుద్దీన్‌ను మంత్రిగా నియమించామని, ఇది మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకేనని తెలిపారు. ఎంఐఎం సభ్యులు కూడా నవీన్ యాదవ్ విజయంలో తోడ్పడాలని కోరారు.
నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మంత్రి అజారుద్దీన్‌తో కలిసి కృషి చేస్తామని చెప్పారు. ముస్లింల ఖబరస్తాన్ సమస్యను డిసెంబర్ లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్‌ఎస్‌కు ఓటు అంటే బీజేపీకి ఓటు వేసినట్టేనని, ఈ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని సీఎం ఎద్దేవా చేశారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినా ఒక్క అభివృద్ధి పనీ జరగలేదని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీల సమస్యలన్నీ ఆ పార్టీ పాలనలో పుట్టిన పాపాలని మండిపడ్డారు.
కృష్ణా జలాలు, శిల్పారామం, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో వంటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పాలనలోనే ప్రారంభమయ్యాయని రేవంత్ పేర్కొన్నారు. కానీ ఆ ప్రాజెక్టుల ముందు నిలబడి ఫోటోలు దిగే బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉచిత ఆర్టీసీ బస్సులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 25 వేల రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పనులు బీఆర్‌ఎస్ చేయలేకపోయిందని, ప్రజలు అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

