సాయంత్రం 4గంటల నుంచి దుకాణాలు బంద్.
( నర్సాపురం, ఆంధ్ర ప్రభ) : మొంథా తుఫాన్ తీవ్రత గంట గంటకు పెరుగుతుంది. మొంథా (Montha) తీవ్ర తుఫాన్ గా రూపాంతర చెంది ఈ రోజు రాత్రికి కాకినాడ .. కోనసీమ ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినట్లు తహసీల్దార్ అయితం సత్యనారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ రెండురోజులు చాలా కీలకం అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని (People should be vigilant) సూచించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు బయటకు రావొద్దని, బలహీనంగా ఉన్న ఇళ్లల్లో కూడా ఉండరాదని, అటువంటి వారు ఎవరైనా ఉంటే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని తెలిపారు.
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు ప్రభుత్వ సమాచారం ను ఎప్పటి కప్పుడు గమనించాలని సూచించారు. తుఫాన్ తీవ్రత (Typhoon intensity) ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఈ రోజు సాయంత్రం 4గంటల నుంచి వర్తక, వ్యాపార సంస్థలను మూసివేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రజలు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా తహసీల్దార్ కార్యాలయంనకు సమాచారం అందించాలని, ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ లకు ఫోన్ చేయాలని సూచించారు.
ఇప్పటికే వివిధ టీమ్ లు తుఫాన్ సేవల్లో నిమగ్నం అయ్యాయని వివరించారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు గస్తీ తిరుగుతున్నాయని తెలిపారు. వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ యంత్రాంగం తమ తమ టీమ్ వర్క్ లు చేస్తున్నారని తెలిపారు. గజ ఈతగాళ్లను సిద్ధం చేశామన్నారు. ప్రకృతి విపత్తును ఎదుర్కునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

