Narayanpet | రహదారి భద్రతా నియమాలు తప్పనిసరి

Narayanpet | రహదారి భద్రతా నియమాలు తప్పనిసరి
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు
Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు ప్రజలకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ సురక్ష అభియాన్–2026 కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన చాంబర్స్‌లో రోడ్ సేఫ్టీ అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నెల జనవరి 5 నుంచి 9 వరకు రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజలలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రహదారి భద్రతా నియమాలు పాటిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని, అప్రమత్తంగా మెలిగితే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్లు నడిపే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. అలాగే వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్ వినియోగం చేయరాదని స్పష్టం చేశారు.
వాహనం నడిపే ప్రతి వ్యక్తి బయటకు వెళ్లినప్పుడు తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, రోడ్లపై జాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు, సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి వింధ్యా నాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి. సాయి మనోజ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. అవినాష్, ట్రాఫిక్ ఎస్.ఐ. కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
