Narayanapeta | పాఠకుల హృదయాల్లో నిలిచిన పత్రిక ఆంధ్రప్రభ

Narayanapeta | పాఠకుల హృదయాల్లో నిలిచిన పత్రిక ఆంధ్రప్రభ
- 2026 క్యాలెండర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
Narayanapeta | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : సత్యాన్వేషణే లక్ష్యంగా, ప్రజల పక్షాన నిలబడుతూ గత 88 ఏళ్లుగా పాఠకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆంధ్రప్రభ దినపత్రిక ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమర్థవంతమైన వారధిగా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కొనియాడారు. ఈ రోజు నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో ఆంధ్రప్రభ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ శ్రీను తో కలిసి అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… స్వాతంత్ర్యానికి ముందునాటి కాలం నుంచి నేటి వరకు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, నిజాయితీగల వార్తా ప్రసారంతో ఆంధ్రప్రభ దినపత్రిక ఒక విశ్వసనీయ వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.
88 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఆంధ్రప్రభ కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రజాసమస్యలను నిరంతరం అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు, ప్రత్యేక శీర్షికలు పాఠకులను ఆకర్షించేలా ఉంటాయని ప్రశంసించారు. ముద్రిత పత్రికతో పాటు స్మార్ట్ ఎడిషన్, యూట్యూబ్ ఛానల్, వెబ్ న్యూస్ వంటి ఆధునిక మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రభ ప్రజలకు క్షణక్షణం సమాచారాన్ని చేరవేస్తోందని తెలిపారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని కలెక్టర్ స్పష్టం చేశారు.
విభిన్న కోణాల్లో రూపొందించే కథనాలు ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ఎంతో దోహదపడుతున్నాయని, ప్రజాస్వామ్యంలో మీడియా కీలక భూమికను పోషిస్తోందని, ఆ బాధ్యతను ఆంధ్రప్రభ సమర్థంగా నిర్వహిస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ తరపున ఆంధ్రప్రభ యాజమాన్యం, సంపాదక బృందం, విలేఖరులు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా ప్రయోజనాల కోసం ఇలాగే నిరంతరం సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ జిల్లా ప్రతినిధి కె. నారాయణరెడ్డితో పాటు జర్నలిస్టులు రఘు గణప, నక్క శ్రీనివాస్, రాజేష్ కుమార్, సులిగెం సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
