Nandyala | జైన్ పరిశ్రమ ప్రారంభానికి ముందడుగు…

Nandyala | జైన్ పరిశ్రమ ప్రారంభానికి ముందడుగు…

  • జైన్ ఇరిగేషన్ సంస్థకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు…
  • రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ…
  • జిల్లా కలెక్టర్..

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో పారిశ్రామికంగా ప్రగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రెటరీ యువరాజ్ పేర్కొన్నారు. జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామ పరిధిలో ఉన్న జైన్ ఇరిగేషన్ సంస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పించి పరిశ్రమ ప్రారంభానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా స్పష్టం చేశారు.

Nandyala

ఇవాళ‌ అమరావతి సచివాలయం నుండి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యువరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లో జైన్ ఇరిగేషన్ సంస్థ ఉత్పత్తి కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యువరాజ్ మాట్లాడుతూ… సుమారు 623.40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న జైన్ ఇరిగేషన్ సంస్థలో డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాల తయారీతో పాటు ఫ్రూట్ జ్యూస్ పరిశ్రమ పనులు ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అత్యవసర ప్రాతిపదికన సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు.

ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నుండి సుమారు 17 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా 0.155 టీఎంసీ నీటి సరఫరా కోసం అవసరమైన అంచనా వేసిన రూ.15 కోట్లను జైన్ ఇరిగేషన్ సంస్థే భరిస్తుందన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే నందికొట్కూరు నుంచి ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌కు వెళ్లే పైప్‌లైన్ ద్వారా నందికొట్కూరు ప్రాంతం నుండి జైన్ పరిశ్రమకు నీటిని విడుద‌ల‌ చేసుకునే అవకాశాలపై సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను సూచించారు. జైన్ ఇరిగేషన్ పరిశ్రమకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు 133 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

వచ్చే ఆరు నెలల లోపు సంస్థకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ…. జైన్ ఇరిగేషన్ సంస్థకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ ప్రతాప్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సుధాకర్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ మహబూబ్ బాషా, జైన్ ఇరిగేషన్ సంస్థ ప్రతినిధి మౌలాలిలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ పనులను వేగవంతం చేసి, మౌలిక సదుపాయాల కల్పనను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply