Nandigama | బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జయంతి వేడుకలు

Nandigama | బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జయంతి వేడుకలు
- వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
- రైతుబజార్ ఆవరణలో ఘనంగా 106వ జయంతి
- సాంస్కృతిక కార్యక్రమాల్లో కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
Nandigama | నందిగామ, ఆంధ్రప్రభ : పట్టణంలోని రైతుబజార్ సమీపంలో ఉన్న బళ్ళారి రాఘవ కళా సమితి కార్యాలయ ఆవరణలో బుర్రకథ పితామహుడు, యక్షగాన గంధర్వుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ నాజర్ 106వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ బుర్రకథను ప్రజల గుండెల్లో నిలిపిన మహానుభావుడు షేక్ నాజర్ అని కొనియాడారు. సామాజిక చైతన్యం, దేశభక్తి, సంస్కృతి పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

నేటి తరానికి బుర్రకథ వంటి జానపద కళారూపాల ప్రాధాన్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, కళాకారుల ప్రదర్శనలకు సభికులు పెద్ద ఎత్తున చప్పట్లతో ఆదరించారు. అనంతరం షేక్ నాజర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, కూటమి నేతలు, కళాకారులు, అభిమానులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
