ఆది దంపతుల విహారం

ఆది దంపతుల విహారం

  • నృత్య కళాకారుల సందడి


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఆది దంపతుల గిరి ప్రదక్షణ (Aadi Dampathulu Giri Pradakshina) అత్యంత స్వాభామానంగా వైభవంగా పౌర్ణమి రోజు జరిగింది. శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఆశ్వయుజ పౌర్ణమి మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆదిదంపతుల గిరి ప్రదక్షణను అట్టహాసంగా నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారు, మల్లేశ్వరి స్వామి వారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా మంగళవారం ఉదయం ఘాట్ రోడ్డు కామదేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. దుర్గగుడి నూతన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (Chairman Borra Radhakrishna), ఈఓ శీనా నాయక్ (EO Sheena Naik) దేవాదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్ జె సి భ్రమరాంబ ఆధ్వర్యంలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శాస్త్రి తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరిప్రదక్షిణ పాదయాత్రను ప్రారంభించారు.

గంగా భారతి సమేత మల్లేశ్వర స్వామివార్ల(Ganga Bharati Sametha Malleswara Swamyvarla) కు ఇంద్రకీలాద్రి చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షణ ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. ఘాట్ రోడ్డు కామదేను అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన ఈ గిరిప్రదక్షిణలో భాగంగా స్వామి వారు, అమ్మవారు నగర పురవీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ గిరి ప్రదక్షణలో అశేష సంఖ్యలో భక్తజనం ఉత్సాహంగా పాల్గొనగా, కనుల పండుగ జరిగిన ఈ దృశ్యాలను తిలకించిన భక్తులు ఆనంద పరవశంలో మునిగిపోయారు. గిరి ప్రదక్షణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాదిమంది భక్తుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో సాంప్రదాయ కళా ప్రదర్శనలతో అత్యంత ఉత్సాహకర వాతావరణంలో కొనసాగింది. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరి సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Leave a Reply