పరీక్ష కోసం నిజం దాచిన ఊరు…

పరీక్ష కోసం నిజం దాచిన ఊరు…
- అమ్మానాన్నలు హత్య…
- తెలియక పరీక్ష రాసిన పదో తరగతి బాలిక
- కూతురి పరీక్ష కోసం విషాదాన్ని దాచిన తండా
- పరీక్ష రాసి వచ్చేసరికి అనాథైన బాలిక
గూడూరు, ఆంధ్రప్రభ ; మహబూబాబాద్ జిల్లా గూడూరు ఈ దృశ్యం చూస్తే రాతి గుండె అయినా కరగాల్సిందే. అమ్మానాన్నలు పట్నంలో హత్యకు గురై విగతజీవులుగా పడి ఉన్నా.. ఆ పాడు వార్త తెలిస్తే ఆ చిన్నారి భవిష్యత్తు చితికిపోతుందని ఒక ఊరంతా ఏకమై నిజాన్ని దాచింది. కన్నవారు ఇక లేరన్న సంగతి తెలియక, అమ్మానాన్నల కలల కోసం ఆ బాలిక పరీక్షా కేంద్రంలో పెన్ను పట్టింది. కానీ పరీక్ష రాసి ఇంటికి వచ్చేసరికి ఆమె ప్రపంచమే కూలిపోయింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గన్యచకృ తండాలో జరిగిన ఈ హృదయవిదారక ఉదంతం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.
కూతురి చదువు కోసం వలస వెళ్లి..
తండాకు చెందిన సోము, మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురి పెళ్లి చేసిన ఈ దంపతులు, చిన్న కూతురు వసంతను బాగా చదివించాలని పట్టుదలతో హైదరాబాద్ పటాన్‌చెరువుకు వలస వెళ్లారు. అక్కడ కూలి పనులు చేస్తూ కూతురిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అయితే, శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆ దంపతులను దారుణంగా హత్య చేశారు.
కన్నీటి పరీక్ష.. కడసారి చూపు కోసం నిరీక్షణ
శనివారం ఉదయమే ఈ విషయం తండా వాసులకు తెలిసినా.. వసంత పదో తరగతి పరీక్ష చెడిపోకూడదని ఎవరూ ఆమెకు చెప్పలేదు. ఏమీ తెలియని ఆ చిన్నారి గుండె నిబ్బరంతో పరీక్ష రాసింది. తీరా పరీక్ష ముగిసి హాస్టల్ వార్డెన్ రజని సహాయంతో ఇంటికి చేరుకున్న వసంతకు.. అమ్మానాన్నలు హత్యకు గురయ్యారన్న వార్త పిడుగులా తగిలింది. “అమ్మా.. పరీక్ష బాగా రాశాను, ఒక్కసారి లేవమ్మా” అంటూ ఆ బిడ్డ చేసిన ఆర్తనాదాలు తండాను కన్నీటి సంద్రం చేశాయి. మరోవైపు, పోస్టుమార్టం ఆలస్యం కావడంతో శనివారం రాత్రి వరకు మృతదేహాలు తండాకు చేరుకోలేదు. కన్నవారి కడసారి చూపు కోసం ఆ పిల్లలు చేస్తున్న నిరీక్షణ వర్ణనాతీతం.
