ములుగు – ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పినందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీలో భూభారతి చట్టం పెట్టినప్పుడు టిఆర్ఎస్ నేతలు తీరును రాష్ట్ర ప్రజలందరూ పరిశీలించారన్నారు. మీరు చట్టం చేసినప్పుడు ఇలాంటి రెవెన్యూ సదస్సును పెట్టరా..? 2020లో కనీసం రెవెన్యూ సదస్సులో కూడా పెట్టలేని చట్టాన్ని మీరు తెచ్చారని బిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టుని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలు నేడు లాంచనంగా ప్రారంభించారు.. అనంతరం మంత్రి పొగులేటి మాట్లాడుతూ, గతంలో ఉన్న తొమ్మిది లక్షల 50 వేల అప్లికేషన్ల సమస్యలను పరిష్కరించే విధంగా ఈ భూభారతి చట్టం వ్యవహరిస్తుందని తెలిపారు. గతంలో సాగులో రైతులు ఉంటారు కానీ.. పట్టా పాస్ పుస్తకంలో మాత్రం పింక్ షర్టు వెసుకున్న వాళ్ళ పేర్లు పాస్ పుస్తకంలో ఉంటుందన్నారు.
ఇలా రైతుబంధు కొట్టేసేందుకు ధరణి చట్టాన్ని అప్పుడు తీసుకొచ్చారని అన్నారు. మీ భూముల సమస్యలను మహిళలు మంగళ సూత్రాలు అమ్ముకొని హైకోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ భారతి చట్టం చేస్తుందని అన్నారు. రెవెన్యూ అధికారులే మీ గ్రామానికి వస్తారు సమస్య అక్కడే పరిష్కరిస్తారన్నారు. గతంలో దొర పెట్టిన పార్ట్ B లో 18 లక్షల ఎకరాల భూములు పేదలవే ఉన్నాయని, ఎవరో ఒకరు తప్పు చేశారని విఆర్వో వ్యవస్థను తీసేసిన పెద్దమనిషి కేసీఆర్ అంటూ ఎద్దేవా చేసారు.
రెవెన్యూ గ్రామాల్లో వస్తున్న సమస్యలను పరిష్కరించేలాగా రెవెన్యూ అధికారుల నియామకాలు చేపడుతున్నామని.. ఏ చట్టం చేసిన పేదలకు ఉపయోగపడేలాగా ఉండాలని ఆయన అన్నారు. ఒక చట్టం కనీసం 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండేలాగా ఉంటుందని, 2020లో చేసిన చట్టం 3 ఏళ్లలోనే ఆ చట్టం ముగిసిపోయిందంటే ఆ చట్టం లో ఎంత లోపాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి కళ్ళలో నీళ్లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీదనే ఉందని అన్నారు. గత ప్రభుత్వం ధరణి చట్టాన్ని నాలుగోడల మధ్యలో రూపొందించారని మంత్రి అన్నారు. వారి అవసరం కోసం ఈ చట్టాన్ని తెచ్చుకున్నారని విమర్శించారు. కానీ, భూభారతి చట్టం ప్రజల మధ్య రూపొందింది ప్రజల కోసం తయారైన చట్టాలని.. మా స్వార్థం కోసం నాయకుల కోసం తయారైన చట్టం భూభారతి కానే కాదని అన్నారు.
ఎమ్మార్వో తప్పు చేస్తే ఆర్డిఓ కి, ఆర్డిఓ తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ కి, అడిషనల్ కలెక్టర్ తప్పు చేస్తే కలెక్టర్ కి చెప్పవచ్చు. ఒకవేళ కలెక్టర్ కూడా తప్పు చేస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ట్రిబునల్ కూడా అందుబాటులోకి తేబోతున్నామని అన్నారు. సరిహద్దులతో భూములను రికార్డు చేసేలా ఈ భూభారతి చట్టం రూపొందిందని, సర్వేయర్లు లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు 6000 మంది సర్వేయర్లకు లైసెన్స్ ఇచ్చామని తెలిపారు. ధరణి చట్టానికి నియమ నిబంధనలు లేవు కానీ.. భూభారతి చట్టానికి నియమ నిబంధనలు నియమించామన్నారు. భూభారతి చట్టంలో ఏమన్నా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి భేషదాలు లేవని, దొరవారి లాగా చేసిన తప్పులు కప్పిపుచ్చుకున్న ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయదని అన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. భూభారతి చట్టం అమలులో పైలెట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలోని వెంకటాపురం ఎంపిక చేయడం రెవెన్యూ మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భూమి అనేది ఒక ఆత్మబలం, ఒక ఆదాయం.. గత ప్రభుత్వం ధరణి పేరుతో దగా చేసిందని అన్నారు. గతంలో నిజమైన రైతులకు గత ప్రభుత్వంలో పట్టాలు కాకుండా నష్టం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అధికారులను వాడుకొని బీఆర్ఎస్ నాయకులు వాళ్ల పేరు మీద భూములను ఎక్కించుకున్నా సందర్భాలు ఉన్నాయి. పేదవారిని ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితే గత పాలకులు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. ప్రజలకు ఏమి దక్కలో అది దక్కేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మంత్రి అన్నారు. మహిళలకు ఇవ్వాల్సిన 3,000 కోట్ల వడ్డీని ఎగకొట్టి పోయారని, అవన్నీ మేము ఇస్తున్నామన్నారు. ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు? ఎవరు దోచుకున్నారో ఆలోచించండి అంటూ మంత్రి మాట్లాడారు.
ఇదే కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రైతు కోసం ఆలోచించిన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ రైతు మనసులో నిలిచిపోయారని ఆవిడ అన్నారు. ధరణి పేరుతో పోర్టల్ పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందిరమ్మ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొస్తే.. అలా మిగిలిన భూములన్నిటిని ధరణి పేరుతో నేతలు వాళ్ల పేరు మీద ఎక్కించుకున్నారు.. కేసీఆర్ రైతుల గురించి తప్ప మిగిలిన అన్ని ఆలోచించేవారని వ్యాఖ్యానించారు. రైతులకు సంబంధించిన ఎకరాలకు ఎకరాల భూములు లాక్కున్న ఘనత గత ప్రభుత్వానికి దక్కిందని ఆమె వ్యాఖ్యానించారు.
గతంలో రైతులు కోల్పోయిన భూములను వారికి అందించేందుకే ఈ భూభారతి చట్టం అందుబాటులోకి వచ్చిందని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి లో ఎవరికి న్యాయం జరగలేదని అన్నారు. భూభారతి చట్టం అమలులో పుట్టుకొచ్చే దళారుల పైనా అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఏ కొత్త చట్టం తీసుకొచ్చిన కొందరు దళారులు తయారవుతారు.. దళారులను నమ్మకండి నేరుగా ప్రభుత్వ అధికారులకే మీ సమస్యలు తెలపండి.. భూభారతి చట్టం ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం ఉంది.. భూభారతి చట్టంలో డబ్బులకు ఆస్కారం లేకుండా, లంచాలకు చోటు ఇవ్వకండని ఆమె అన్నారు.