Mudiraj | హక్కుల సాధనకు ఉద్యమించాల్సిందే..

Mudiraj | హక్కుల సాధనకు ఉద్యమించాల్సిందే..
Mudiraj, మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ : ముదిరాజుల ప్రధాన ఏజెండా బీసీ డీ నుండి ఏ లోకి మార్చితే ఉద్యోగ, ఉపాధి, విద్య, రాజకీయ అవకాశాల్లో తమ కులస్థులకు మెరుగైన అవకాశాలు అందుతాయన్న ఏకైక ఉద్దేశ్యంతో పోరాటం సాగుతుందని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామస్థాయిలో సేకరించిన పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించడం జరిగిందని.. ఎమ్మార్వో కార్యాలయాల్లో జరిగిన నిరసన కార్యక్రమాలతో పాటు ముదిరాజుల హక్కులకు బీసీ డీ నుండి ఏలోకి మార్చే ప్రతిపాదన రూపొందించడం జరిగింది అన్నారు.
ఎన్నికల షెడ్యూల్.. రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బందుల కారణంగా పోరాటాన్ని వాయిదా వేసి తిరిగి ప్రారంభించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ఈనెల 29న బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందించి ఆ తదుపరి బీసీ కమిషన్ కు మెమోరాండం సమర్పణ తదుపరి చర్యలపై కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు స్పష్టం చేశారు. మహాసభ రాష్ట్ర నాయకులు జిల్లా నేతలు ఈ కార్యక్రమానికి విధిగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
