MSFS | ఆటలు ఆరంభం..

MSFS | ఆటలు ఆరంభం..
- ద్విరాష్ట్ర ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ క్రీడా, సాంస్కృతిక పోటీలు ప్రారంభం
- 100 అడుగుల ఎత్తు జాతీయ జెండా ఆవిష్కరణ
MSFS | సీతమ్మధార, ఆంధ్రప్రభ : ద్విరాష్ట్ర ఎమ్ఎస్ఎఫ్ఎస్ 11వ క్రీడా, సాంస్కృతిక పోటీలు సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రాంగణంలో శనివారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాల ఈ పోటీలను ప్రారంభించారు. 100 అడుగుల ఎత్తు ఉన్న జాతీయ పతాకాన్ని వందేమాతర గీతం 150వసంతాల స్ఫూర్తిగా ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ జనరల్ మేనేజర్ రెవరెండ్ ఫాదర్ బి. సురేష్ బాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఉడుమల బాల, సురేష్ బాబులు మాట్లాడుతూ క్రీడా, సాంస్కృతిక ప్రతిభతో విద్యార్థులకు బంగారు భవిత ఏర్పడుతుందన్నారు. ప్రతి పాఠశాలలో క్రీడా, సాంస్కృతిక రంగాలలో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఉత్తేజం -ప్రేరణ -వికాసానికి ఇటువంటి పోటీలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సీతమ్మధార ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ మనోజ్ మాట్లాడుతూ ఈ క్రీడా సాంస్కృతిక పోటీలు తమ ఆధ్వర్యంలో జరగడం గర్వంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, కబడ్డీ, కోకో, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్ అంశాల్లో తమ ప్రతిభను చాటి చెప్పడానికి వందలాదిమంది విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నారన్నారు. వీటితోపాటు విద్యార్థుల విజ్ఞానాన్ని ప్రోత్సహించడం కోసం వ్యాసరచన, క్విజ్, డిబేట్ చిత్రలేఖనం వంటి పోటీలను కూడా నిర్వహిస్తున్నామన్నారు.

గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఏఐ రంగ ప్రవేశంతో సహజ సిద్ధమైన ప్రతిభకు ఆటంకం కలుగకుండా ఎప్పటిపప్పుడు నేటితరంకు ఇలాంటి పోటీలు నిర్వహించడం ఎంతో అవసరం అన్నారు. గతంలో మిషనరీ స్కూల్స్‌లో చదవడం కొందరికే సాధ్యమయ్యేదని, నేడు అన్నివర్గాలకు మిషనరీ స్కూల్స్‌లో విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. ఎస్ఎఫ్ఎస్ ఎడ్యుకేషన్ విభాగం జనరల్ సెక్రటరీ రెవరెండ్ ఫాదర్ ఆంథోనీ స్వామి ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో పతకాలను సాధించిన కె.పూర్ణిమ, ప్రపంచ అంధుల క్రికెట్‌లో ప్రతిభ కనపరిచిన పి. కరుణ కుమారి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నుంచి అవార్డ్స్ అందుకున్న కె. శ్రీనివాస్ చక్రవర్తి, ఎన్. తేజ, డాక్టర్. పల్లి మాధురి, శ్రీ ప్రద పోచన పెద్ది, అయేషా భాను, ఆర్. హాసిని, బి. శశికుమార్, ఆకుల సాయి సంహిత, కిర్ల యస్వంత్ లను ఘనంగా సత్కరించారు.

