MPDO | కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
MPDO | కొడకండ్ల, ఆంధ్రప్రభ : కొడకండ్ల మండలంలోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల (SC College) బాలికల వసతి గృహాన్ని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహానికి సంబంధించిన విద్యార్థులు, సిబ్బంది వివరాలను, పలు రికార్డులు, వంటగది, మరుగుదొడ్లను, పరిసర ప్రాంతాలను సైతం పరిశీలించారు. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలన్నారు. విద్యార్థులకు (Students) మెనూ ప్రకారంగా రుచికరమైన, నాణ్యమైన వేడి భోజనం అందించాలని గుర్తు చేశారు. వసతి గృహ ఆవరణ పరిసరాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వసతి గృహ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ లో రాసి వేయాలని సూచించారు.

విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించే దిశగా ప్రతిరోజూ క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వమే అందిస్తున్న వసతి, భోజనం, స్కాలర్‌షిప్ వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో (MPDO) కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల తహసీల్దార్ చంద్రమోహన్, ఎంపీడీవో నాగ శేషాద్రి సూరి, అధికారులు పాల్గొన్నారు.

