Movie | సఃకుటుంబానాం ఆచరించడం సంతోషకరం – రాజేంద్రప్రసాద్

Movie | సఃకుటుంబానాం ఆచరించడం సంతోషకరం – రాజేంద్రప్రసాద్
Movie | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన చిత్రం సఃకుటుంబానాం. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ (Sudhakar) కీలక పాత్రలు పోషించారు. సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపీగా పని చేశారు. ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. జనవరి 1వ తేదీన విడుదలైన ఈ సినిమా 2026 మొదటి హిట్ గా నిలిచిన సందర్భంగా సఃకుటుంబానాం చిత్ర బృందం సక్సెస్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendraprasad) గారు మాట్లాడుతూ… ” నేను 48 సంవత్సరాలుగా అందరికీ ఒక కుటుంబ సభ్యుడిలా ఉన్నాను. ఇటువంటి మంచి సినిమాను ఆదరించి సఃకుటుంబానాం చిత్రాన్ని హిట్ చేశారు. కుటుంబం అంటే తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ముందుంటారు. అటువంటి సఃకుటుంబానాం చిత్రాన్ని ప్రేక్షకులంతా కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆదరిస్తున్నారు. అది నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. నేను బ్రతికున్నంత కాలం నా తెలుగు ప్రేక్షకుల కోసం నటిస్తూనే ఉంటాను. ఇటువంటి మంచి కథలతో మరెన్నో సినిమాలును దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థియేటర్లు పెరుగుతున్నాయి అంటే సినిమా ఎంత విజయం సాధించిందో అర్థం అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాను మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు (Director) ఉదయ్ శర్మ మాట్లాడుతూ… “ఈ 2026 తొలి హిట్ గా మా చిత్రం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు, మాకు సపోర్ట్ చేసిన మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి సినిమాను నిర్మించిన మహదేవ్ గౌడ్, ఈ సినిమాలో నటించి మాకు సపోర్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ఇతర నటీనటులకు రుణపడి ఉంటాను. ఒక సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చితే హిట్ అవుతుందని నా నమ్మకం. రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూసి అది నేర్చుకున్నాను. సినిమాను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
