Mothkur | మహిళలే మహారాణులు..!

Mothkur | మహిళలే మహారాణులు..!

  • కలిసి వస్తున్న రిజర్వేషన్లు..
  • మున్సిపాలిటీలో చక్రం తిప్పుతున్న మహిళలు..

Mothkur, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో మహిళలలే మహారాణులుగా చక్రం తిప్పుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు కానీ.. మహిళలు తాము ఎవరికి తక్కువ కాము అన్న రీతిలో రిజర్వేషన్ కి మించి అదనంగా కౌన్సిలర్లుగా గెలుస్తున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు కీలకం అవుతున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో 12 స్థానాల్లో మహిళలకు 6 స్థానాలు కేటాయించినప్పటికి 7 గురు మహిళలు కౌన్సిలర్లుగా గెలిచారు. ఈ దఫా ఎన్నికల్లో సైతం 7 గురు మహిళలు కౌన్సిలర్లు గా గెలుపొందారు. తొలి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ఇద్దరు మహిళా కౌన్సిలర్లు 5 ఏండ్ల కాలపరిమితిలో తీపిరెడ్డి సావిత్రి, గుర్రం కవిత లు చైర్మన్ గా పని చేశారు.

ఈ దఫా ఎస్సి మహిళకు కేటాయించడంతో.. మహిళా కౌన్సిలర్ చైర్మన్ కానుంది. వైస్ చైర్మన్ పదవి కాస్త గతంలో మగ మహారాజులకే అవకాశం ఇవ్వగా.. ప్రస్తుతం కూడా వారికే దక్కనుంది. గత పాలకవర్గంలో 2 కో ఆప్షన్ పదవులు సైతం మహిళలకు కట్టబెట్టారు. ఈ దఫా కో ఆప్షన్ ఎన్ని పదవులు ఇస్తారో వేచి చూడాల్సిందే. ఏదైమైనప్పటికి మోత్కూర్ మున్సిపాలిటీ లో వరుసగా రెండు సార్లు మహిళలకు రిజర్వేషన్లు కలిసి రావడం వారి అదృష్టంగా భావిస్తుండగా… నిత్యం పార్టీ కార్యక్రమాలలో బిజీగా తిరుగుతూ, ఆర్ధిక భారం మోస్తున్న మగ మహారాజులకు కుర్చీ ఎక్కే అవకాశం రావడం లేదు. ఇప్పటికే 2 టర్మ్ లు జనరల్ మహిళ, ఎస్సి మహిళలకు చైర్మన్ పీఠం రాగా… రాబోయే 5 ఏండ్లలో మళ్లీ బీసీ మహిళ వస్తే ఎలా ఉంటుందో అని ఇప్పటి నుండే రాజకీయ నాయకులు అంచనాలు వేస్తున్నారు.

దశాబ్దాల తర్వాత… దళితులకు దక్కిన చైర్మన్ పదవి….!
ఆత్మగౌరవం దక్కిందంటున్న దళితులు
మోత్కూర్ గ్రామపంచాయతీ ఏర్పడి 6 దశాబ్దాలు గడిచినా.. తాము ఎప్పుడు జనరల్, బీసీ వర్గాలకు మద్దతు ఇవ్వడం, ఓట్లు వేయడం తప్పా.. తాము సర్పంచ్ కుర్చీ సైతం అధిరోహించలేదని.. మోత్కూర్ మున్సిపాలిటీలో 2 వ టర్మ్ లో ఎస్సి మహిళకు చైర్మన్ పదవి రావడం.. తమ దళిత మహిళలకు అత్యున్నతమైన మున్సిపల్ చైర్మన్ పదవి దక్కడం తమ దళిత జాతికి ఆత్మగౌరవం దక్కిందని పలువురు దళిత నాయకులు బహిరంగంగా చర్చించుకుంటూ ఆనందపడుతున్నారు.

Leave a Reply