MODIKUNTA PROJECT | మోడీకుంటకు మోక్షం !
MODI KUNTA PROJECT | ఇరవై ఏళ్ల తర్వాత ప్రాజెక్టు పనుల్లో కదలికలు
MODIKUNTA PROJECT | వాజేడు (ములుగు జిల్లా), ఆంధ్రప్రభ : సాగు, తాగు నీరు అందించేందుకు రూపకల్పన చేసిన మోడీకుంట ప్రాజెక్టు (MODIKUNTA PROJECT) కు మోక్షం కలగనుంది. సుమారు ఇరవై ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోని ప్రాజెక్టు పనుల్లో ఇప్పుడిప్పుడు కదలికలు ప్రారంభమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలో 13,590ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 35 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ములుగు జిల్లా వాజేడు మండలం కృష్ణాపురం వద్ద మోడీకుంట వాగు ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యాయి.
మోడికుంట వాగుపై రిజర్వాయర్ నిర్మించాలని 2005 మే 26న అప్పటి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా రూ.124.6 కోట్లు మంజూరు చేశారు. ప్లాన్ ప్రకారం 1,259 మీటర్ల పొడవైన మట్టికట్ట, 92 మీటర్ల స్పిల్వే, 21.85 కిలోమీటర్ల ప్రధాన కాలువ, పది డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు (PROJECT) పనులకు టెండర్ పిలవగా, ‘గామన్ ఇండియా’ సంస్థ రూ.118.95 కోట్ల బిడ్డింగ్ గెలుచుకొని 2005 జూలైలో ఒప్పందం చేసుకుంది. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండగా, దాదాపు 1,250 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం తలెత్తింది. ప్రాజెక్టు పూర్తి అయితే, 13,590ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించగలదు. 35 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంగా పెట్టుకున్నారు.
అనుమతుల ఆలస్యం, గుత్తేదారు నిర్లక్ష్యం వంటి సమస్యలు ఎదురయ్యాయి. నీటిపారుదల శాఖ ప్రకారం, కాలువల కోసం భూసేకరణ జరిగినప్పటికీ గుత్తేదారు సంస్థ పనులు చేపట్టలేదు. పలుమార్లు నోటీసులు (Notices) జారీ చేసినా స్పందన లేకపోవడంతో, 2022 ఆగస్టులో ఈ సంస్థను తొలగించి కొత్త గుత్తేదారునికి బాధ్యతలు అప్పగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంచనాలను సవరించింది. కొత్త అంచనా వ్యయం రూ.527.66 కోట్లుగా నిర్ధారించి, 2022 ఆగస్టు 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయాన్ని అనుసరించి సంబంధిత ఎస్ఈ, 2023 అక్టోబర్ 29న ‘గామన్ ఇండియా’ సంస్థకు నోటీసు ఇచ్చారు.
తదనంతరం మళ్లీ టెండర్ ప్రక్రియ మొదలుపెట్టే ప్రయత్నం జరిగినప్పటికీ, ‘గామన్ ఇండియా’ (Gammon India) సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతులు ఇచ్చిన సంవత్సరం గడిచిన తర్వాతే గుత్తేదారుకు నోటీసు ఇవ్వడం గమనార్హం. హైకోర్టు ఆదేశాల మేరకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై తమ వాదనలను వినిపించేందుకు నీటిపారుదలశాఖ అవకాశం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2024 జనవరి 31న ములుగులోని ఎస్ఈ ఎదుట గుత్తేదారు ప్రతినిధులు హాజరై సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించారు. వాటిని ప్రభుత్వ న్యాయవాదులు పరిశీలించి, గుత్తేదారును తొలగించిన తొలి ఉత్తర్వుల ప్రకారమే ముందుకు సాగాలని సూచించారు. దీనిపై నీటిపారుదలశాఖ తుది నిర్ణయం తీసుకుంది.
2024-25 నూతన ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా తాజా అంచనాలు రూపొందించారు. అటవీ భూమి, భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల మొత్తం ఖర్చు రూ.720.84 కోట్లుగా నిర్దేశించారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు (Engineering officers) పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ 2024 నవంబరులో పరిశీలించింది. ఆ పరిశీలనలో రూ.718.6 కోట్ల ఖర్చును ఆమోదించింది. ఈ మేరకు మే 17న నీటిపారుదల శాఖ అధికారిక ఆదేశాలు జారీ చేయగా, జూలై 29న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది. ఇప్పటికే ఎస్ఆర్సి కంపెనీ తరఫున గత వారం రోజుల నుండి సర్వే పనులు చేపడుతున్నారు. వచ్చే రెండు నెలలు ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

