చిత్తూరులో.. మొబైల్ రికవరీ మేళా..
చిత్తూరు, (ఆంధ్రప్రభ బ్యూరో) :
చిత్తూరు జిల్లా పోలీసులు Chat Bot 9440900004, CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 315 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. 13వ విడతల రూ.63 లక్షల విలువ గల 315 మొబైల్ ఫోన్లు రికవరీ చేయగా, ఇప్పటి వరకు 13 విడతలుగా మొత్తం 4,106 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ రూ.8.55 కోట్ల రూపాయలు. ఈ మొబైల్ ఫోన్లను చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన ‘మొబైల్ రికవరీ మేళా’ కార్యక్రమంలో బాధితులకు అందజేశారు.
మారుతున్న జీవనశైలిలో మొబైల్ ఫోన్ మన జీవితంలో భాగమైపోయిందని, అది పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా, ఇంట్లో నుంచే చిత్తూరు పోలీసుల Chat Bot లేదా CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి మొబైల్‌ను తిరిగి పొందవచ్చని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 13వ సారి ఇంత పెద్ద స్థాయిలో మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం ఆనందకరమని తెలిపారు. ఈ రికవరీ కార్యక్రమంలో జిల్లా క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో చాట్ బాట్ సిబ్బంది బాపూజీ, రఘురామన్ బృందం విశేష కృషి చేసింది.
చిత్తూరు పోలీసుల ప్రయత్నాలతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. బాధితులందరూ తమ ఫోన్లు తిరిగి అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఫిర్యాదు చేసిన బాధితులకు కోరియర్ ద్వారా మొబైల్ ఫోన్లు నేరుగా ఇంటికి పంపిణీ చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న రికవరీలను కూడా త్వరలో పూర్తి చేస్తామని పోలీసులు వెల్లడించారు.
చాట్ బాట్ ద్వారా ఫిర్యాదు చేసే విధానం:
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ వివరాలను WhatsApp నంబర్ 9440900004 కు “HI” లేదా “HELP” అని పంపాలి. వెంటనే Welcome to Chittoor Police అనే లింక్ వస్తుంది. ఆ లింక్‌లో District, Name, Age, Father’s Name, Address, Contact Number, Mobile Model, IMEI Number, Lost Place వంటి వివరాలను పూర్తి చేసి Submit చేయాలి. ఆ వెంటనే ఫిర్యాదు నమోదు అవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ CEIR పోర్టల్ https://www.ceir.gov.in ద్వారా కూడా మొబైల్ ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదు చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. చిత్తూరు పోలీసుల Chat Bot/CEIR సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించు కోవాలని సూచించారు.

