బల్మూర్ మండల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ : బల్మూర్ మండలంలోని పోలిశెట్టి పల్లి, చెన్నారం, గోదల్, కొండారెడ్డిపల్లి, తుమ్మన్‌పేట, పోలేపల్లి, జినుకుంట్, గట్టు తుమ్మెన్ గ్రామాల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం పాల్గొన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, తమిళనాడు రాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులు, జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డా.వంశీకృష్ణ అన్నారు.. “మీ ఆశీస్సులతోనే నేను ఎమ్మెల్యేగా మీ సేవలో ఉన్నాను. గ్రామాభివృద్ధికి స్థానిక సమస్యలు తెలిసిన నాయకత్వం అవసరం. అందుకే ప్రజల్లో నిరంతరం అందుబాటులో ఉండే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను మనం నిలబెట్టాము.”
స్థానిక ప్రతినిధి, ఎమ్మెల్యే కలిసి పనిచేస్తేనే గ్రామాలకు నిధులు, అభివృద్ధి వేగంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. రానున్న 17-12-2025న జరగనున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో బల్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
