TG |కేసీఆర్ తో ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి భేటి

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ లాబీలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఫిరాయింపు నేత, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కలుసుకున్నారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే ఫిరాయింపు నేతల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఫిరాయింపుదారులపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోన‌ని ఎదురుచూస్తున్న తరుణంలో కేసీఆర్‌ను మహిపాల్‌ రెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొంతకాలానికే ఆయన యూటర్న్‌ తీసుకున్నారు. కాంగ్రెస్‌లో అనధికారికంగా కొనసాగుతున్నప్పటికీ పలు సందర్భాల్లో బీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

అంతెందుకు పటాన్‌చెరులోని తన క్యాంపు కార్యాలయంలో కూడా కేసీఆర్‌ ఫొటోనే పెట్టుకున్నారు. దీనిపై కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నించినప్పటికీ.. బరాబర్‌ కేసీఆర్‌ ఫొటో ఉంచుకుంటానని స్పష్టం చేశారు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరించారని గుర్తుచేశారు. క్యాంపు కార్యాలయం తన నివాసమని, ఇక్కడ కేసీఆర్‌ ఫోటో పెట్టుకోవడంలో తప్పేమిటని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *