మక్తల్ , ఏప్రిల్ 25 (ఆంధ్రప్రభ) : మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మక్తల్ సూపర్ ప్రీమియర్ లీగ్ (ఎంఎస్పి ఎల్) టోర్నమెంట్ ను ఇవాళ స్థానిక ఎమ్మెల్యే డా.వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీడాకారులకు పుట్టినిల్లు మక్తల్ పట్టణమన్నారు. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ క్రీడల్లో క్రీడాకారుల సందడి కనిపించేదన్నారు. క్రీడా మైదానాన్ని ఇక నుండి క్రీడాకారుల సందడితో మార్చాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల వల్ల అనేక లాభాలున్నాయని, ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. స్టేడియం నిర్మాణంలో కుంచించుకుపోయిన క్రీడా మైదానాన్ని తిరిగి నిర్మించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానన్నారు.
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో గెలుపు ఓటములను స్వీకరించాలని ఆయన సూచించారు. పూర్తిస్థాయిలో క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, ఇండోర్ స్టేడియాలను అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఎంఎస్పీఎల్ నిర్వాహకులు కోళ్ళ వెంకటేష్ తదితరులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభినందించారు. బహుమతుల ప్రధానోత్సవానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని పిలిపించి స్టేడియం నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించేలా తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, నిర్వాహకులు కోళ్ల వెంకటేష్, సిఐ రామ్ లాల్, ఎస్ఐ వై.భాగ్యలక్ష్మి రెడ్డి, నాయకులు చంద్రకాంత్ గౌడ్, కట్ట సురేష్ కుమార్, కావాలి తాయప్ప, కావలి శ్రీహరి, యగ్నేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.