MLA | 4.54 కోట్ల చేప పిల్లల పంపిణీ..
Nizamabad | నిజామాబాద్, ఆంధ్రప్రభ : మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి(P. Sudarshan Reddy) తెలిపారు.
మత్స్య అభివృద్ధి పథకం కింద 2025 – 2026 సంవత్సరానికి గాను వంద శాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎడపల్లి మండలం జానకంపేట్ లోని అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి(Collector T. Vinay Krishna Reddy)తో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చేప పిల్లలను లాంఛనంగా వదిలారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమక్షంలో చేప పిల్లల రకాలను, సైజును, నాణ్యతను పరిశీలించి, బరువును తూకం వేస్తూ, ఒక్కోటిగా వాటి సంఖ్యను క్షుణ్ణంగా లెక్కించిన మీదట చెరువులో వదిలారు.
జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్ లో 4.54 కోట్ల చేప పిల్లలను పెంపకం నిమిత్తం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే అశోక్ సాగర్ చెరువు(Ashok Sagar Lake)లో బొచ్చ, రోహు, బంగారు తీగ జాతికి చెందిన 1,14,600 చేప పిల్లలు వదలడం జరిగిందని వివరించారు. ప్రతి చోట చెరువులు, ఇతర జలాశయాలలో చేప పిల్లలను వదిలే ముందు మత్స్య కార్మిక సంఘాల సభ్యులు తప్పనిసరిగా వాటి నాణ్యతను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు(NUD Chairman Kesha Venu), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ స్వామి, మత్య్స కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

