రాజముద్రతోనే సమస్యలకు చరమగీతం…

రాజముద్రతోనే సమస్యలకు చరమగీతం…

పాస్ బుక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే
పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కొల్లికుళ్ల గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పంపిణీ చేశారు. ఆస్తి అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో వ్యక్తిగత ఫోటోలతో ముద్రించిన పాసుపుస్తకాలు ఇవ్వడం వల్ల అనేక సాంకేతిక న్యాయ సంబంధిత సమస్యలు తలెత్తాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

ప్రత్యేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ముద్రించిన పుస్తకాల విషయంలో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని, భూమి రికార్డుల విషయంలో స్పష్టత లోపించిందని విమర్శించారు.ఇప్పుడైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారిక రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తూ, భూ యజమానులకు న్యాయ పరిరక్షణ కల్పిస్తోందని తెలిపారు.రాజముద్ర ఉన్న పాసుపుస్తకాలు ప్రభుత్వ అధికారిక ధృవీకరణకు ప్రతీకగా నిలిచి, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చేస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అనంతరం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు పెనుగంచిప్రోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 4 లక్షల 87 వేల 572 రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ స్వయంగా బాధితులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు రెవిన్యూ అధికారులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply