MLA | మహిళల స్వావలంబనకే పెద్దపీట..

MLA | మహిళల స్వావలంబనకే పెద్దపీట..

  • పి 4లో ఉచిత బ్యూటీషియన్ శిక్షణలతో స్వయం ఉపాధికి బాటలు..
  • స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా గౌరవప్రదమైన జీవితం..
  • యువత, మహిళలకు ఉచిత శిక్షణలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
  • ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు..

(ఆంధ్రప్రభ పాయికాపురం) : మహిళల ఆర్థిక స్వావలంబనకు, స్వయం ఉపాధికి ప్రభుత్వమే అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. పి 4 కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా అందిస్తున్న బ్యూటీషియన్ శిక్షణలు వారి జీవితాల్లో సుస్థిరమైన మార్పుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్ రామలింగేశ్వరపేట, మూడవ లైన్‌లో గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ కోర్సుల ప్రారంభోత్సవం ఇవాళ‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొండా ఉమా మాట్లాడుతూ… స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారానే నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమని తెలిపారు.

MLA

యువతీ యువకులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తోందన్నారు. టెన్త్, ఇంటర్మీడియట్‌తో పాటు డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిన వారికి కూడా వారి అర్హతలకు తగిన విధంగా ఐటీ కోర్సులు, జావా, ఏ డబ్ల్యు ఎస్ వంటి ఆధునిక సాంకేతిక శిక్షణలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ శిక్షణలు ఉద్యోగాలు లేదా స్వయం ఉపాధి సాధించేలా రూపకల్పన చేయబడినవని వివరించారు. మహిళలకు ఇంటి వద్ద నుంచే ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన బ్యూటీషియన్ కోర్సుల ద్వారా మహిళలు ఇంటి వద్ద నుంచే లేదా ఇంటి సమీపంలో పని చేస్తూ ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

MLA

శిక్షణ పూర్తిచేసిన వారు స్వంతంగా బ్యూటీ పార్లర్లు ప్రారంభించవచ్చని, లేక ఇతర పార్లర్లలో ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. ఇందుకు అవసరమైన సబ్సిడీలు, రుణాలు ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పి 4 కార్యక్రమంలో భాగంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున శిక్షణలు అందిస్తున్నాయని, ఇది ఉపాధి అవకాశాల విస్తరణకు దోహదపడుతోందన్నారు.

మహిళలు జనాభాలో సగభాగం ఉన్నారని, ఈ రంగంలో వారికి విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. చదువుకున్నా, చదువుకోని వారైనా అందరూ తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పీ 4 కార్యక్రమం, ఎన్జీవోల సమన్వయంతో మరిన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింతగా అండగా నిలుస్తామని బొండా ఉమా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర 2047 టీమ్, రమేష్, ఆరాధ్యుల మురళి, విజయకృష్ణ సూపర్ బజార్ చైర్మన్ వెలగా సురేష్, పరశు నగేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply