MLA |ప్రతి ప్రభ బండికి కొబ్బరికాయ కొట్టి శుభారంభం..

MLA | ప్రతి ప్రభ బండికి కొబ్బరికాయ కొట్టి శుభారంభం..
ప్రజల సుభిక్షానికి స్వామి దీవెనలు కోరిన ఎమ్మెల్యే..
MLA | నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : గీసుకొండ మండలం లో ప్రసిద్ధి చెందిన కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం జాతరను పురస్కరించుకొని నర్సంపేట నియోజకవర్గం నుండి వందలాది గ్రామాల నుంచి కదిలిన కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ప్రతి ప్రభ బండి ముందు కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేసి భక్తులకు ఆశీస్సులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… హోలీ పర్వదినం నుంచి ప్రారంభమయ్యే కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరకు నర్సంపేటతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభ బండ్లను కట్టే సాంప్రదాయం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వందలాది గ్రామాల ప్రజలు ప్రభలు కట్టి భక్తిశ్రద్ధలతో జాతరకు తరలివెళ్లడం ఆనందదాయకమని తెలిపారు. కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి మహిమ అపారమైనది.

స్వామి కరుణాకటాక్షాలతో నర్సంపేట నియోజకవర్గం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సుభిక్షంతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు అవుతున్నాయని, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రభ బండ్ల వెంట గ్రామాల ప్రజలు, మహిళలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భజా భజంత్రీల నాదంతో, పార్టీ గీతాలతో, ఉత్సాహభరిత నృత్యాలతో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నర్సంపేట నియోజకవర్గ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున హాజరై జాతర ఉత్సవాలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందంగా, ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు.
