బాబూరావు మృతి తీరని లోటు

బాబూరావు మృతి తీరని లోటు
అవనిగడ్డ – ఆంధ్రప్రభ : చరిత్ర పరిశోధకుడు బాబూరావుగా పేరొందిన గొప్ప చరిత్ర పరిశోధకుడు యద్దనపూడి విఠల్ వేణుగోపాలరావు (కరణం బాబూరావు) మరణం పరిశోధక రంగానికి సాహిత్య రంగానికి తీరని లోటు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మొవ్వ మండలం యద్దనపూడికి చెందిన బాబూరావు మృతి పట్ల ఎమ్మెల్యే సోమవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. అపూర్వమైన దివిసీమ చరిత్రను వెలికి తీయాలనే తపనతో కృషి చేసిన గొప్ప చరిత్రకారుడు బాబూరావు అని తెలిపారు. కరణీకము వృత్తి చేస్తూ అనుకోని విధంగా చరిత్ర పరిశోధనపై మక్కువ పెంచుకున్నారని తెలిపారు.
చరిత్ర పరిశోధనలకు శాసనాలను తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకోసం బాబూరావు పట్టుదలతో శాసనాలలో వుండే లిపిని నేర్చుకున్నారని తెలిపారు. దివిసీమ పూర్వ చరిత్ర గ్రంథాన్ని బాబూరావు వ్రాశారని, దివి మహోత్సవాలలో ప్రముఖ గేయ రచయిత, దివిసీమ వాసి వేటూరి సుందర రామమూర్తి, యద్దనపూడి సులోచనారాణి ఉన్న వేదికపై చలనచిత్ర నటి అంజలీదేవి తన చేతుల మీదుగా ఆవిష్కరింపబడిన ఆ గ్రంథం పలువురు చరిత్రకారులచే ప్రశంసలను అందుకుందన్నారు. మొదటిలో ‘ప్రజామిత్ర’ (బెంగళూరు), బాలమిత్ర, ఆంధ్రపత్రిక, అమ్మ, బాపు, తదితర పత్రికలకు బాబూరావు వ్యాసాలు, కథలు, సీరియల్లు, కల్పిత గాథలు వ్రాసేవారని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
