సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :తెలంగాణ రాజధాని హైదరాబాద్ విశ్వనగరి పేరు.. అందాల పోటీల నిర్వహణతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ప్రపంచ సుందరి పోటీలను నెలరోజుల పాటు నిర్వహించి సత్తా చాటుకుంది. ఇదేవేదికపై 108 దేశాల అందాల భామలు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడ్డారు. ప్రతి అంశంలోనూ సత్తా చాటుకున్నారు. ఎట్టకేలకూ థాయ్‌లాండ్ సుందరి ఓపల్ ఫర్ హర్ ఉద్యమ వ్యవస్థాపకురాలు సుచాతా ప్రపంచ సుందరి కిరీటాన్ని ముద్దాడారు. ఈ పోటీలో టాప్- 8 వరకు మిస్ ఇండియా నందిని గుప్తా చేరుకున్నారు.
కాగా, మిస్‌వరల్డ్ విజేతకు ₹8. 50 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా చేతుల మీదుగా ఓపల్ సుచాతా మిస్ వరల్డ్ 2025 కిరీటం అందుకున్నారు. 21 ఏళ్ల ఈ యంగ్ బ్యూటీ సంచలనం సృష్టించడంతో ప్రపంచవ్యాప్తంగా ఓపల్ పేరు మారుమోగుతోంది. ఓపల్ సుచాతా అంటే ఎవరో తెలుసుకోవడానికి యావత్ ప్రపంచం నెట్టింట సెర్చ్ చేస్తోంది.
నిరాశ లేదు.. నిస్పృహ తెలీదు
మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన తొలి థాయిలాండ్ యువతిగా ఓపల్ సుచాత చరిత్ర సృష్టించింది. ఔను, థాయిలాండ్ లోని ఫుకెట్ నగరానికి థానెట్ డోంకామ్నెర్డ్, సుపాత్ర చువాంగ్స్రీ దంపతులకు 2003లో సెప్టెంబర్ 20న సుచాత జన్మించింది. ఫుకెట్ నగరంలో ఆమె తల్లిదండ్రులు వ్యాపారంలో రాణిస్తున్నారు. ఆమె విద్యాభ్యాసం మొత్తం థాయిలాండ్ లోనే సాగింది. ప్రస్తుతం ఓపల్ బ్యాంకాక్ లోని తమ్మాషాట్ యూనివర్సిటీలో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో డిగ్రీ చేస్తోంది. 2021 నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. 2021లో ఆమె ‘మిస్ రత్తన కోసిన్’ పోటీల్లో పాల్గొంది. కానీ ఈ పోటీల్లో ఎంపిక కాలేదు. అయినప్పటికీ నిరాశ చెందలేదు. ఆ మరుసటి ఏడాది 2022లో మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీల్లో పాల్గొంది.
ఈ పోటీలు ఆమెకి మంచి ఫలితాన్నిచ్చాయి. సుచాత మూడో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత తొలి రన్నరప్ తప్పుకోవడంతో రెండో రన్నరప్గా అవకాశం దక్కింది. 2024లో తన పేరు ప్రపంచం మొత్తం తెలిసేలా సుచాతా బలమైన ముద్ర వేసింది.
మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2024 పోటీల్లో విజేతగా నిలిచింది. అదే ఏడాది మెక్సికోలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొనే చాన్స్ దక్కింది. మిస్ యూనివర్స్ పోటీల్లో మూడవ రన్నరప్ గా నిలిచింది. తర్వాత కొన్ని కారణాలతో ఆ స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. ఒక్కో మెట్టు ఎదుగుతూ సుచాతా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకునే స్థాయికి ఎదిగింది.
భయంపై విజయ
నారీ ఓపల్ సుచాతాకు 16 ఏళ్ల ప్రాయంలోనే అతిపెద్ద సవాల్ ఎదురైంది. స్వీట్ సిక్ట్సీన్ ఏజ్ లోనే బ్రెస్ట్ క్యాన్సర్కి గురయ్యారు. తనకి కేన్సర్ ఉందని తెలుసుకున్న క్షణం భరించలేని ఒత్తిడికి, భయానికి గురైంది. కానీ అమెకు అమ్మానాన్న తోడుగా నిలిచారు. బ్రెస్ట్ కేన్సర్ ను తట్టుకుంది. ఈ కష్టం నుంచి బయటపడింది. బ్రెస్ట్ కేన్సర్ అపాయకరం కాదని గుర్తించింది. ఇలాంటి బాధ పగోళ్లకు రాకూడదని భావించింది.
కానీ, ఎలాంటి సదుపాయాలు లేకుండా బ్రెస్ట్ కేన్సర్ తో పోరాటం చేస్తున్న ఒంటరి మహిళల పరిస్థితి ఏంటనే ఆలోచన వచ్చింది. ఇట్లా ఒంటరి మహిళల కోసమే ‘ఓపల్ ఫర్ హర్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది.
వారికి అండగా నేనున్నా.. ‘‘కేన్సర్ అని తెలియగానే నేను కన్న కలలన్నీ నాశనం అవుతాయని అనుకున్నా. ఆక్షణంలో నా చేతుల్లో ఏమీ లేదు.. మొత్తం కోల్పోయా అనే ఫీలింగ్ కలిగింది. నాకు సోకిన బ్రెస్ట్ కేన్సర్ అంత అపాయకరమైనది కాదు. అయినప్పటికీ ఆ వయసులో నాకు కలిగిన ఆందోళన అంతా ఇంతా కాదు. నాలో కలిగిన ఆ ఆందోళనే నా జీవితానికి టర్నింగ్ పాయింట్’’ అని సుచాతా తెలిపింది.
బ్రెస్ట్ కేన్సర్ ని ఎదుర్కొనడానికి ఆ సమయంలో అన్ని వనరులున్నాయి. బ్రెస్ట్ హెల్త్ విషయంలో అమ్మాయిలకు సహకారం, అవగాహన అవసరం అని నేను నమ్ముతా. వాళ్లు ఒంటరిగా పోరాటం చేయకూడదు. తన ఓపల్ ఫర్ హర్ సంస్థ ద్వారా చాలామంది మహిళలకు ఉచిత స్క్రీనింగ్ అవకాశం కల్పించానని తెలిపారు. పాఠశాలల్లో ఆరోగ్య విద్యను ప్రోత్సహించాం.. నిజ జీవిత కథల్ని పాడ్‌కాస్ట్‌ల ద్వారా పంచుకున్నాం.. థాయిలాండ్‌లో మెరుగైన ఆరోగ్య విధానాల కోసం పోరాడుతున్నాం.. అని అమ్మాయిలకు ఈ విశ్వసుందరి దైర్యం పలికింది.