Minister | ఐనవోలు బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేద్దాం

Minister | ఐనవోలు బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేద్దాం
- జాతరకు అన్నీ విధాల సహకరిస్తాం
- భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడండి
- పట్నం,బోనం చేసే వారిని వేధించొద్దు
- రాష్ట్ర శాఖ మంత్రి కొండా సురేఖ
- ఆహ్వాన పత్రికను మంత్రి సురేఖకి అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు
Minister | వరంగల్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పర్వదినంతో ప్రారంభమయ్యే ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) సూచించారు. జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలుగకుండా అన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వపరంగా అన్నీ విధాల సహాయ, సహకారాలు, తోడ్పాటును అందిస్తామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని దేవాదాయ, ధర్మాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖను సోమవారం వారి నివాసంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు(Sri Mallikarjuna Swamy Brahmotsavam) (జాతర) సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్, ఈవో, ప్రధాన అర్చకులతో కలిసి మంత్రివర్యులకు అందజేశారు. జాతరలో భక్తులను నిలువు దోపిడీ చేసే చర్యలు జరుగకుండ చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ ఆదేశించారు. బోనం, పట్నం పేర అధిక డబ్బులు గుంజకుండా చూడాలన్నారు.
మేడారంకు ముందే ఐనవోలు జాతరకు భక్తులు పొట్టేత్తే అవకాశముందని గుర్తించి అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ సూచించారు. మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే నాగరాజులకు, స్వామివారి శేష వస్త్రాలను అందజేసి ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తదనంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సురేఖకు ఎమ్మెల్యే నాగరాజును అడిగి తెలుసుకున్నారు.
బ్రహ్మోత్సవాలను భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆలయ ఈవో సుధాకర్ ,ఆలయ ప్రధాన అర్చకులతో పాటు నందనం గ్రామ సర్పంచ్ జెట్టబోయిన రాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పిన్నింటి అనిల్ రావు, మహమ్మద్ చోటే తదితరులు పాల్గొన్నారు.
