జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు

జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు

విజయవాడ, ఆంధ్రప్రభ : ఉమ్మడి కృష్ణా జిల్లాను సంక్షేమ పథకాలు, అభివృద్ధికి కేంద్రంగా మారుస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ(R&B) అతిధి గృహంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లు కృష్ణా జిల్లాను సర్వ నాశనం చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కృష్ణా జిల్లా అంటే అభివృద్ధికి, కళలకు నెలవుగా ఉండేదని.. గత ఐదేళ్లు బూతులకు, అరాచకాలకు కేంద్రంగా వైసీపీ(YCP) నేతలు మార్చారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాలైన అరాచకాలకు పాల్పడినా జిల్లా అభివృద్ధే కూటమి నాయకుల ప్రథమ లక్ష్యం అన్నారు. ప్రతి నెలా జిల్లాలోని ఎమ్మెల్యేలందరం సమావేశమై జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి గురించి, సమస్యల గురించి చర్చించుకుని వాటిని ముఖ్యమంత్రి వద్దకు, ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) వద్దకు తీసుకెళ్లి పరిష్కరించుకుంటాం.

కూటమి నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లడం వలనే 16 సీట్లు గెలుచుకున్నాం. అదే స్ఫూర్తితో జిల్లాను కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి రోజుకో రకంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటి వరకు గూగుల్ సంస్థపై విమర్శలు గుప్పించిన జగన్ రెడ్డి(Jagan Reddy).. ఇప్పుడు తానే గూగుల్ తీసుకొచ్చానని కొత్త భాష్యం చెబుతున్నాడు.

డేటా సెంటర్‌కు.. ఏఐకి.. కంప్యూటర్‌కు తేడా తెలియని సన్నాసి జగన్ రెడ్డి. డేటాకు మైండ్ అనుసంధానిస్తే అదే ఏఐ అనడం జగన్ రెడ్డి బుద్ధి రాహిత్యానికి నిదర్శనం. 2018లోనే ఏపీలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొస్తే.. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి భూ కేటాయింపులు రద్దు చేసి తరిమేశాడు. అలాంటి జగన్ రెడ్డి.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్దదైన డేటా సెంటర్(Data Center) ఏపీలో ఏర్పాటు చేయడం జీర్ణించుకోలేక రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు.

సుమారు 13 దేశాలను అనుసంధానం చేస్తూ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకింత కడుపు మంట అని ప్రశ్నించారు. గత ఐదేళ్లు రాష్ట్ర సంపద కొల్లగొట్టి అభివృద్ధి లేకుండా చేసిన జగన్ రెడ్డి.. ప్రజలు చీత్కరించిన తర్వాత కూడా అదే అరాచకాన్ని నమ్ముకున్నాడు. మద్యాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతానన్న జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీశాడు. అలాంటి కల్తీ జగన్ రెడ్డి.. ఇప్పుడు మద్యం కల్తీ(Liquor adulteration) గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే కల్తీ బ్రాండ్లు తీసుకురావడం నిజం కాదా? కల్తీ వ్యాపారానికి అడ్డంకులు ఉండకూడదనే ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేయడం నిజం కాదా.?

కూటమి అధికారంలోకి వచ్చాక మెరుగైన మద్యం పాలసీని తీసుకురావడంతో పాటుగా, ఎక్కడా తప్పులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎన్ఫోర్స్ మెంట్ విభాగాన్ని పటిష్టం చేయడం వలనే మొలకలచెరువు, ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో కల్తీ దందాను పట్టుకున్నాం. కల్తీ మాట వినిపించకుండా చేయడం కోసమే ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ తీసుకొచ్చాం.

షాపు యజమానులతో పాటుగా, వినియోగదారులు కూడా స్కాన్ చేసి బాటిల్ వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించాం. ఇప్పటి వరకు 1.50 లక్షల మంది యాప్ డౌన్ లోడ్(App Download) చేసుకోగా, 3.20 లక్షల బాటిళ్లు స్కాన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడా ఒక్క ఫిర్యాదు కూడా నమోదవ్వలేదు. బెల్టు షాపులపై కూడా కటినమైన చర్యలు తీసుకుంటున్నాం. బెల్టు నిర్వహిస్తే మద్యం షాపు లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు.

మద్యం కల్తీ గురించి గంటలు గంటలు ప్రెస్ మీట్ పెట్టే జగన్ రెడ్డి.. ఒక్కచోటైనా కల్తీని నిరూపించారా అని ప్రశ్నించారు. గుడ్డకాల్చి మొహాన వేస్తామనే చందాన మద్యంపై ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉన్నపుడు మాత్రమే అభివృద్ధి సాధ్యం. ఇదే కూటమి ప్రభుత్వం(Govt.) మరో 15 సంవత్సరాలు కొనసాగుతుందన్నారు. ఇప్పటికే పెట్టుబడులకు పరిశ్రమలకు కేంద్రంగా ఏపీని మార్చాం.

గూగుల్, క్వాంటం కంప్యూటింగ్, ఇండస్ట్రియల్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్ పరిశ్రమలు ఏపీలో ఏర్పాటయ్యాయి. అదే సమయంలో పోలవరం అమరావతి నిర్మాణంతో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నాం. కోస్తాలో ఉన్న పోర్టుల్ని(Portals) కేంద్రంగా చేసుకుని ఆక్వా పరిశ్రమలను విస్తరిస్తున్నాం. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ఒప్పందాలు కూడా చేసుకున్నాం. నవంబరు 14, 15న విశాఖ కేంద్రంగా పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించబోతున్నాం.

అభివృద్ధి బాటలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh State)లో జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తులకు మరోసారి అవకాశం రాకుండా చూసుకోవాలి. జగన్ రెడ్డి అనే విధ్వంసకారుడిని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా అద్యక్షుడు, ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ నెట్టెం రఘురాం, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజా, వసంత కృష్ణ ప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్, కాగిత కృష్ణ ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పాల్గొన్నారు.

Leave a Reply