Kurnool | వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం…

Kurnool | వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం…
జుర్రేరు వాగు ఫ్లడ్ ప్రొటెక్షన్ బండ్స్ పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి…
Kurnool | కర్నూలు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : బనగానపల్లెలోని జుర్రేరు వాగు వరద రక్షణ కట్టలు (ఫ్లడ్ ప్రొటెక్షన్ బండ్స్ ) పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి (BC Janardhan Reddy) భూమిపూజ చేశారు. జుర్రేరు వాగుకు ఇరువైపులా ఫ్లడ్ ప్రొటెక్షన్ బండ్స్ నిర్మాణానికి రూ.6.90 కోట్లు డియంఎఫ్ గ్రాంట్ నిధులు మంజూరు చేయడం ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

వరదలు, భారీ వర్షాలు (Heavy rains) కురిసే సమయంలో ఫ్లాష్ ఫ్లడ్, వరద ముప్పు నుంచి బనగానపల్లె పట్టణాన్ని శాశ్వతంగా రక్షించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదనీరు పట్టణంలోకి ప్రవేశించడాన్ని నివారించేందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాగు ఆక్రమణలను పూర్తిగా అరికట్టేందుకు, సురక్షితమైన డ్రైనేజీ వ్యవస్థ స్థాపనకు ఈ పనులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యస్ ఆర్ సీ బ్రిడ్జి నుండి పాత బస్టాండ్ వరకు దాదాపుగా 1250 మీటర్ల పొడవున కట్ట నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ నిర్మాణం శాశ్వతంగా ఉండేలా ఇరువైపులా మట్టికట్టలు, రాయి రివెట్ మెంట్ పనులు చేపట్టడంతో పాటు… 8నెలల కాలవ్యవధిలో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ (Walking track) అభివృద్ధి చేసే విధంగా రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. కట్టలు పూర్తయితే భవిష్యత్తులో 52వేల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహాన్ని పట్టణం నుండి దూరంగా మళ్లించే సామర్థ్యం కలిగి ఉండేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

వాగు ఇరువైపులా అంతర్గత సిమెంట్ కాంక్రీట్ డ్రైన్స్ (Cement concrete drains) దాదాపు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో… పట్టణ డ్రైనేజ్ నీరు వాగులో కలవకుండా నిరోధించేందుకు కట్టలు, డ్రైనేజ్ వ్యవస్థ కీలకమన్నారు. తద్వారా పట్టణ పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
