Minister l అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..

Minister l అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..
Minister l కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నిమ్మాడలోని తన నివాస కార్యాలయంలో పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోగా అన్ని పనులను పూర్తి చేయాలని, ఏ గ్రామంలో చూసినా మట్టి రహదారులు కనిపించకుండా సిమెంటు రహదారులు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, బకాయి ఉన్న బిల్లుల వివరాలన్నింటినీ వెంటనే అంతర్జాలంలో నమోదు చేయాలని ఆదేశించారు.
రైతుల సంక్షేమం కోసం నియోజకవర్గంలో కొత్తగా రెండు ఎత్తిపోతల సాగునీటి పథకాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంతబొమ్మాళి మండలం వాడ్రాడ, కొండపేట ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. వీటితో పాటు మదనగోపాల సాగరం ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త పథకం రానున్న నేపథ్యంలో, పాత పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ సమీక్షలో ఆర్డీవో కృష్ణమూర్తి, ఆయా శాఖల అధికారులు సుధాకర్, వీరన్నాయుడు, రామకృష్ణ, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
