SAVE ARAVALI | ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషేధం..

SAVE ARAVALI | ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషేధం..
- కేంద్రం సంచలన నిర్ణయం
ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అతి పురాతన పర్వత శ్రేణులైన ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర మైనింగ్, పర్యావరణ శాఖలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ నిర్ణయంతో ఇకపై ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలకు తావులేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గత కొంతకాలంగా ఆరావళి పర్వత శ్రేణులలో జరుగుతున్న మైనింగ్ కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నవంబర్ 20న సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాలకు సంబంధించి ఇచ్చిన ‘యూనిఫాం డెఫినిషన్’ (ఏకరీతి నిర్వచనం) తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది.
SAVE ARAVALI క్యాంపెయిన్ సక్సెస్
అయితే, ఈ నిర్ణయం వల్ల పర్వతాల రక్షణ కంటే మైనింగ్ మాఫియాకే ఎక్కువ లాభం చేకూరుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా #SAVEARAVALI పేరుతో సాగిన ఉద్యమం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆరావళి పర్వతాలకు ప్రభుత్వం మరణ శాసనం రాస్తోందని పర్యావరణవేత్తలు విమర్శించారు.
దిల్లీతో పాటు… పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని అడ్డుకోవడంలో ఆరావళి పర్వతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిని ధ్వంసం చేస్తే భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజల నుండి వస్తున్న తీవ్ర నిరసనలు, విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పర్యావరణ సమతుల్యతను కాపాడటమే తమ ప్రాధాన్యతని పేర్కొంటూ, ఆరావళి ప్రాంతంలో మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : AC Pallevelugu : ఇక ఏసీ ‘పల్లె వెలుగు’లు
