సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చెలరేగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై,.. లక్నోపై ఎదురుదాడి చేసింది. ఓపెనర్లు అదిరే ఆరంభం అందించగా.. వారి తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా అదే ఫ్లోని కొనసాగిస్తూ పరుగుల వరద పారించారు. దాంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు రాబట్టింది.
ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ తొలి ఓవర్ నుంచే బౌండరీల మోత మోగించాడు. 32 బంతులు ఎదుర్కున్న రికెల్టన్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 58 అర్థ శతకం సాధించాడు. ఇక రోహిత్ శర్మ వరుస సిక్సులతో (12) పరుగులు చేసి క్యాచ్ ఔటయ్యాడు. రికెల్టన్ – రోహిత్ కలిసి తొలి వికెట్ కు 17 బంతుల్లో 33 పరుగులు జోడించారు.
వన్ డౌన్ గా వచ్చిన విల్ జాక్స్ (29) ఆకట్టుకున్నాడు. విల్ జాక్స్ తో జతకట్టిన ర్యాన్ రికెల్టన్ రెండో వికెట్ కు మరో భారీ భగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 35 బంతుల్లో 55 పరుగులు జోడించారు. అయితే, దంచికొడుతున్న రికెల్టన్‌ను దిగ్వేష్ రాఠి పెవిలియన్‌కు పంపాడు. దాంతో ముంబై 88 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ఆ తరువాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. 28 బంతులు ఎదుర్కున్న సూర్య 4ఫోర్లు, 4 సిక్సులతో 54 అర్ధ శతకం నమోదు చేసి 17.3 ఓవర్లో ఔటయ్యాడు. అయితే అంతకముందు 11.3, 13, 15.1 ఓవర్లలో విల్ జాక్స్, తిలక్ వర్మ (6), కెప్టెన్ హార్దిక్ పాండ్య (5) రూపంలో స్వల్ప పరుగులకే ముంబై వరుస వికెట్లు కోల్పోయింది.
చివర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 25 నాటౌట్), కార్బిన్ బాష్ (10 బంతుల్లో 20) దూకుడుగా ఆడారు. దాంతో ముంబై స్కోర్ భారీగా నమోదైంది.
లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టగా… ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఇక 216 పరుగుల భారీ టార్గెట్ తో లక్నో జట్టు ఛేదనకు దిగనుంది.