Metro Rail | శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి కేవలం 40 నిమిషాలే – మెట్రో ఎండీ
హైదరాబాద్ – ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందని.. ఈ మార్గంలో మెట్రో రైలు వెళితే కేవలం 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చని వెల్లడించారు.
ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌కి సంబంధించిన సర్వే పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ల తర్వాత నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.
ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది సీఎం సంకల్పమని తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఎండీఏ, టీజీ ఐఐసీలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆయన వివరించారు.దాదాపు 15 వేల ఎకరాల్లో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.