హంగూ.. ఆర్భాటం లేకుండా..!

- సాదాసీదాగా వచ్చి.. శ్రమదానం…!
- “సమాక” గిరి పల్లెలో సర్కారు పథకాల అమలుపై ఆరా..!
- క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి..
- ఆదిలాబాద్ జిల్లాలో మీనాక్షి నటరాజన్ హల్ చల్..
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆమె.. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress party) కి జాతీయ స్థాయి కార్యదర్శి (National level secretary)..! అందులో అధికారంలో ఉన్న తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి కూడా..! అయితేనేo.. ఎలాంటి ఆర్భాటం, హంగు ప్రదర్శించకుండా అతి సాధారణ కార్యకర్తలా ఎవరికీ తెలియకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. రాత్రి టీటీడీసీలో బస చేసిన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) గురించి కాంగ్రెస్ నేతలకు ఎలాంటి సమాచారం కూడా లేదు.
ఏఐ సి సి జాతీయ కార్యదర్శిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మీనాక్షి నటరాజన్ శుక్రవారం ఉదయం తన దినచర్యలో భాగంగా పరిసరాల్లో పేరుకుపోయిన గడ్డి, చెత్త స్వయంగా తొలగించి తన బాధ్యతగా శ్రమదానం (Shramadanam) లో పాల్గొన్నారు. అంతటితో ఊరుకోకుండా బస చేసిన గదుల్లోని బాత్రూం టాయిలెట్లను బాత్ రూమ్, టాయిలెట్లను స్వయంగా శుభ్రపరచారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీనేతలు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు చేరుకోగా వారితో మాట్లాడేందుకు సుతారమూ ఇష్టపడలేదు. మనం రోజూ కాలకృత్యాల దిన చర్యల్లో భాగంగా శ్రమదానం కూడా సామాజిక బాధ్యతగా గుర్తించాలని హితబోధ చేశారు. పార్టీ నాయకులు మాత్రం హడావుడిగా అక్కడికి చేరుకొని మేడం మాట్లాడే సమయం ఇవ్వకపోవడంతో నిరాశతో నిట్టూర్చారు.
మీనాక్షి వెంట 40 మంది బృందం.. సమాకలో సమస్యలపై ఆరా..!
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఆదివాసుల పోరుగడ్డ ఇంద్రవెల్లి మండలం సమక మారుమూల గిరిజన గ్రామానికి వెళ్లారు. తనతో పాటు వివిధ రాష్ట్రాల నుండి చేరుకున్న 40మంది సభ్యులు గల ఆర్.టి.ఐ బృందం (RTI Team) కాసేపు ఆమెతో భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో గిరిజనులు పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పేదలందరికీ చేరుతున్నాయా లేదా అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలు (Indiramma’s Houses), రుణమాఫీ, పోడు భూముల పట్టాలు, పెన్షన్ల గురించి మీనాక్షి క్షుణ్ణంగా ఆరా తీశారు. జాబితా ప్రకారం కొందరికి పథకాలు లబ్ధి చేకూరడం లేదని తెలిసి బాధితులను తన బృందానికి అప్పగించి ఇంద్రవెల్లి తహసీల్దార్ కార్యాలయంలోని ప్రజా పరిపాలన విభాగంలో సమస్యలు విన్నవించారు. ఆరు గ్యారెంటీ పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా, పారదర్శకంగా అమలు పరచాలని సూచించారు. అయితే రహస్యంగా మీనాక్షి నటరాజ్ అదిలాబాద్ జిల్లాలో పర్యటించడం సర్వ త్రా చర్చనీయాంశం కాగా, అధికార యంత్రాంగంలోనూ ఆమె దూకుడు అలజడి రేపింది. ఈనెల 18న రాత్రి మీనాక్షి నటరాజన్ ఎవరికి చెప్పా పెట్టకుండా వచ్చి వెళ్లినట్టు ఆలస్యంగా వెలుగు చూసింది.
