షెల్ట‌ర్లలో మెడికల్ క్యాంపులు..

షెల్ట‌ర్లలో మెడికల్ క్యాంపులు..

  • మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ‘మొంథా’ తుపాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రసవ తేదీకి వారం రోజుల వ్యవధి కలిగిన సుమారు 787 మంది గర్భిణిలను సమీప ఆసుపత్రులకు తరలించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

ఎ.ఎన్.ఎం.ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ప్రసవ సమయానికి దగ్గర్లో ఉన్న గర్భిణిలను సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు స్థానిక అధికారులు పంపిస్తున్నారని చెప్పారు. హైరిస్కులో ఉన్న గర్భిణిల విషయంలో వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.

కృష్ణా జిల్లాలో 240, ఏలూరు జిల్లాలో 171, కోనసీమ జిల్లాలో 150, తూర్పు గోదావరి జిల్లాలో 142 మంది గర్భిణిలను ఇప్పటివరకు తరలించినట్లు తెలిపారు. అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఇదేవిధంగా గర్భిణిలను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తుపాన్ ప్రభావిత 17 జిల్లాల్లో ఈ చర్యలు కొనసాగుతున్నాయని సోమవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

పీహెచ్ సి వైద్యుల నేతృత్వంలో వైద్య శిబిరాలు

తుపాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని 17 జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన షెల్టర్ల (పునరావాస కేంద్రాలు)లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి వైద్య శిబిరంలో ఓ పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్, ఎ.ఎన్.ఎం., ఆశా వర్కర్ల‌ను నియమించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 551 షెల్టర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని చెప్పారు. ఉప ఆరోగ్య కేంద్రాల్లో సీహెచ్ఓలు అందుబాటులో ఉన్నారని తెలిపారు.

నిశితంగా హాజరు పరిశీలన

తుపాన్ సహాయక విధుల్లో పాల్గొనే వారి హాజరును నిశితంగా పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ స్పష్టంచేశారు. జిల్లాలకు పంపిన ప్రామాణిక విధి విధానాలు (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్)కు అనుగుణంగా అధికారులు, వైద్యులు, సిబ్బంది వ్యవహరించాలని స్పష్టంచేశారు.

సోమవారం సాయంత్రం అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులతో… కార్యదర్శితోపాటు ఇంఛార్జి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ నీలకంఠారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Leave a Reply