ఎన్టీఆర్ వైద్యసేవలో అక్రమ వసూళ్ళ పై విచారించాలి

ఎన్టీఆర్ వైద్యసేవలో అక్రమ వసూళ్ళ పై విచారించాలి
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేద రోగులపై అదనపు వసూళ్లు జరుగుతున్నాయంటూ నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కు వినతిపత్రం సమర్పించారు. ఆదివారం ఉదయం నవతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఉచితంగా చేయాల్సిన ఆపరేషన్లకు కొన్నినెట్వర్క్ ఆసుపత్రులు డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.
స్టెంట్లు, రాడ్లు, ప్లేట్లు వంటి వైద్య సామగ్రి అమర్చే సమయంలో ప్రభుత్వం అందిస్తున్నవి నాసిరకమని, మంచి సామగ్రి వేయాలంటే అదనంగా డబ్బులు ఇవ్వాలంటూ కొందరు వైద్యులు రోగులను మోసం చేస్తున్నారని తెలిపారు. వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందించాలనే ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని ఆయన అన్నారు.
వెంటనే ఈ అక్రమ వసూళ్లను నిలిపివేయాలని, లేనిపక్షంలో ఎవరు ఎంత వసూలు చేశారనే పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రికి అందజేస్తామని హెచ్చరించారు. ఇష్టం లేకపోతే వైద్యసేవ నుంచి వైదొలగాలని, పేదలను దోచుకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
అవసరమైతే బాధితులతో కలిసి సంబంధిత ఆసుపత్రుల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో ముందుగా హెచ్చరిస్తున్నామని, పద్ధతి మారకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓకు వినతిపత్రం పంపిస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని పేర్కొన్నారని తెలిపారు. అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటికి సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలిపారు.
