కాల్పుల విరమణకు సిద్ధం.
.ప్రభుత్వం ఈ హత్యాకాండను ఆపేయాలి..
మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ
న్యూ ఢిల్లీ – ‘‘ఆపరేషన్ కగార్’’ పేరుతో దండకారణ్యంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుపడుతుండటంతో వందల సంఖ్యలో నక్సలైట్లు రాలిపోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 148 కు పైగా మావోయిస్టులు హతమయ్యారు. ముఖ్యంగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న బస్తర్ దండకారణ్యంలో ఇటీవల జరిగిన ప్రతీ ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యలో మావోలు హతమయ్యారు.
ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ వెల్లడించారు.
తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో హత్యాకాండలను ఆపాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ఒప్పుకుంటే, తాము శాంతి చర్చలకు సిద్ధమని తెలిపారు. కాల్పుల విరమణ ప్రకటిస్తామని మావోయిస్టులు ప్రకటించారు. ఈమేరకు మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అజయ్ పేరిట లేఖ విడుదలైంది. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని లేఖలో కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సానుకూలంగా స్పందించాలని కోరారు.
వచ్చే ఏడాది మార్చి లోపే మావోయిజం అంతం – అమిత్ షా
2026 మార్చి వరకు మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చెప్పారు. దీనికి అనుగుణంగానే ‘‘ఆపరేషన్ కగార్’’ పేరుతో దండకారణ్యంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతీ ఎన్‌కౌంటర్‌లో కూడా మావోయిస్టులు హతమవుతున్నారు. గత మూడు నెలల్లో మహారాష్ట్ర ,జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో 120 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు శాంతిచర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో హైదరాబాదులో శాంతి చర్చకు సంబంధించి మేధావులు మానవ హక్కుల సంఘాలు పలువురు నేతలు జరిపిన సమావేశానికి స్పందిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ మేరకు లేఖను విడుదల చేసింది