ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఈరోజు (గురువారం) 17 మంది మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్ పోలీసుల ముందు లొంగిపోయారు.
ఇటీవల కేంద్ర భద్రతా బలగాల కూంబింగ్ పెరగడం, పార్టీలో సైద్ధాంతిక లోపాలు, సీనియర్ల దోపిడీ వంటి చర్యలతో తాము లొంగిపోతున్నామని మావోయిస్టులు పేర్కొన్నారు. కాగా వీరిలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నవారు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
లొంగిపోయిన మావోయిస్టుల్లో 9 మందిపై రూ.24 లక్షల రివార్డులు ఉన్నాయి. వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దినేష్ మొడియం ఉండగా, ఇతనిపై అత్యధికంగా రూ.8 లక్షల రివార్డ్ ఉంది. దినేష్ భార్య జ్యోతి అలియాస్ కళా మొడియం మీద రూ.5 లక్షల రివార్డు ఉంది.
వీరంతా గంగలూరు ఏరియా కమిటీలో కీలక హోదాల్లో పనిచేస్తున్నారని బీజాపూర్ పోలీసులు తెలిపారు. వీరి ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున సహాయం అందిస్తామని, అలాగే పునరావాసం కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.
గతేడాది నుంచి ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ లో 792 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ లొంగుబాటులో జిల్లా రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు కీలక పాత్ర పోషించినట్టు బీజాపూర్ ఎస్పీ తెలిపారు.