- ఈనెల 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల స్మారక సభలు
- మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ లేఖ విడుదల
ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా.. మావోయిస్టు కేంద్రకమిటీ జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈక్రమంలో మావోయిస్టు కేంద్ర కమిటీ ఆభయ్ పేరిట శనివారం లేఖ విడుదల చేశారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మరణించిన నేపథ్యంలో ఈనెల 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా చేసుకున్న కేంద్రం ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు కీలక నేతలను భద్రతా దళాలు మట్టబెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మావోయిస్టుల నుంచి ఓ లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖలోనంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందారని వెల్లడించింది.
శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపడం లేదని మావోయిస్టులు ప్రశ్నించారు. 2 నెలలుగా తాము సంయమనం పాటించామని చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్రాల ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా ఈనెల 10న బంద్‌కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.