Manthani | మంథని గడ్డ … మంత్రి శ్రీధర్ బాబు అడ్డా …

Manthani | మంథని గడ్డ … మంత్రి శ్రీధర్ బాబు అడ్డా …

  • మంథని మున్సిపల్ కాంగ్రెస్ హస్తగతం

Manthani | మంథని, ఆంధ్రప్రభ : మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు మున్సిపల్ విజయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. మంథని మున్సిపల్ పరిధిలో 13 వార్డులో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 11 వార్డులు కైవసం చేసుకున్నది. మూడో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మాచిడి రాజు, ఆరవ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పోతరవేణీ శ్రీలత క్రాంతి కుమార్ లు విజయం సాధించారు. మంథని మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాఖా గెలిపించుకున్న దుద్దిళ్ళ సోదరులు

మంథని గడ్డ …దుద్దిళ్ళ సోదరుల అడ్డా అనడంలో సందేహమే లేదని పలువురు చర్చించుకుంటున్నారు. మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు అభ్యర్థుల కంటే ఎక్కువ ప్రజలతో మమేకమయ్యారు. దుద్దిళ్ళ సోదరులు చేసిన ప్రచారానికి ప్రజలంతా అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. పకడ్బందీ ప్రణాళికతో మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు తమ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకోవడంలో విజయం సాధించారు. మంత్రి శ్రీధర్ బాబు పాలనకు మంథని ప్రజలు జై కొట్టి ఆశీర్వదించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక మంత్రిగా, సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా.. రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు.. తన సొంత నియోజకవర్గమైన మంథని నియోజక వర్గ సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి అభివృద్ధి మార్కును చూపిస్తున్నారు.

అంతేకాక మంథని పట్టణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి మంథని మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అన్న మంత్రి శ్రీధర్ బాబు కు తోడుగా తమ్ముడు టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు సైతం మంథని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు. మంత్రి శ్రీధర్ బాబు స్ట్రాటజీతో తమ పార్టీ అభ్యర్థులు గెలిచారని కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు చర్చించుకుంటున్నారు.

విజయం సాధించిన అభ్యర్థులు

మంథని మున్సిపల్ పరిధిలో ఒకటో వార్డులో కుర్ర లింగయ్య, రెండవ వార్డులో నూకల కమల్, మూడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాచిడి రాజు గౌడ్, నాలుగవ వార్డులో మద్దికట్ల స్రవంతి రమేష్ బాబు, ఐదవ వార్డులో ముస్కుల సహేందర్ రెడ్డి, అరవ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పోతరవేణి శ్రీలత క్రాంతి కుమార్, ఏడవ వార్డులో జంబోజు శ్రీమతి సమ్మయ్య, ఎనిమిదవ వార్డులో లైశెట్టి రజిత రాజు, తొమ్మిదవ వార్డులో మారుపాక నిహారిక నాగరాజు, పదవ వార్డులో పెంటరి రాజేందర్, పదకొండవ వార్డులో వోడ్నాల శ్రీనివాస్, పన్నెండవ వార్డులో వేముల లక్ష్మీ సమ్మయ్య, పదమూడవ వార్డులో ఎల్లంకి వంశీధర్ విజయ బావుటా ఎగురవేశారు. విజయం సాధించిన అభ్యర్థులు ఈనెల 16వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తారు. అదే తేదీన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండనున్నది. అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల లాంచనమే కానుంది.

Leave a Reply