హైదరాబాద్ : ప్రఖ్యాత కవయిత్రి, ప్రముఖ వ్యాఖ్యాన ప్రయోక్త మంజుల సూర్య సృజన రచనగా అందించిన అపూర్వ కవిత్వ సంకలనం ‘ నెమలీక ‘ గ్రంధం ఆవిష్కరణకు ముందే పలువురు ప్రముఖ కవులతో పాటు వర్ధమాన కవుల , రచయిత్రులను విశేషంగా ఆకర్షిస్తోంది.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ , ప్రఖ్యాత రచయిత కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రభ సంపాదకులు , విఖ్యాత విమర్శకులు వై . ఎస్.ఆర్. శర్మ, ప్రముఖ సాహిత్యవేత్త బిక్కి కృష్ణ తదితర ప్రముఖుల ప్రశంసలు పొందిన ‘నెమలీక ‘ చక్కని కవిత్వ గ్రంధాన్ని గత రెండు రోజులుగా త్యాగరాయ గానసభలో జరుగుతున్న పలు సాంస్కృతిక ఉత్సవాలలో త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి రసజ్ఞులకు, అతిధులకు బహూకరించడంతో పలువురు ప్రముఖుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
నెమలీక రచయిత్రి మంజులాసూర్య మానవ విలువలకు కట్టుబడ్డ ప్రకృతి ప్రేమికురాలని హైకోర్ట్ పూర్వ న్యాయమూర్తి జస్టిస్ కాశీవిశ్వేశ్వరరావు పేర్కొనగా, అద్భుత వాక్యనిర్మాణం మంజులాసూర్య ‘నెమలీక’ కవిత్వ వైభవంలో దర్శనమిస్తోందని తెలంగాణ శాసనమండలి పక్షనేత, శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి అభినందనలు వర్షించడం గమనార్హం.
త్యాగరాయగానసభలో ఈ నెలంతా జరిగే అనేక సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనే అతిధులకు జ్ఞాపికగా మంజులాసూర్య నెమలీక గ్రంధాన్ని బహూకరించడం కేవలం సరస్వతీ సేవగా భావిస్తున్నామని , మంజులా సూర్య వినయం వివేకథలతో పాటు అద్భుతమైన కవిత్వ స్పర్శ ఉన్న సమాజ సంక్షేమ కవయిత్రి అని జనార్ధనమూర్తి చెప్పారు.
మంజులా సూర్య ఇలా ఉచితంగా అందమైన కవిత్వ సౌందర్య పుస్తకాన్ని తొలిసారిగా తెలుగు వాకిళ్ళకు సుమారు వెయ్యి ప్రతులు పంచడానికి త్యాగరాయ గానసభకు అప్పగించడం ఆమెకు కవిత్వం పట్ల వుండే అచ్చమైన , స్వచ్ఛమైన సమర్పణా భావాన్ని తెలియచేస్తోందని పలువురు తెలుగు కవులు , రచయితలు, విమర్శకులు అభినందనలు వర్షిస్తున్నారు.
అతి త్వరలోనే కవిత్వ సాహిత్య శిఖరాలనడుమ ఈ ‘ నెమలీక ‘ సౌందర్యాన్ని, సామాజిక స్పృహను ఆవిష్కరిస్తే సమంజసంగా ఉంటుందని ఆమె సన్నిహితులు పేర్కొనడం సమంజసంగా ఉందని విమర్శకులు తలలూపుతున్నారు.

