కేదారేశ్వరపేట, (ఆంధ్రప్రభ): మానవత్వం తలదించుకునే ఘోర సంఘటన విజయవాడలో వెలుగుచూసింది. తన స్వంత (మూడు సంవత్సరాల) కూతిరినే కిడ్నాప్ చేసి విక్రయించిన కసాయి తండ్రిని, అతనికి సహకరించిన ఇద్దరు నిందితులను జిఆర్పి పోలీసులు సాహసోపేతంగా చేజ్ చేసి పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.
జిఆర్పి ఎస్‌హెచ్‌ఓ జె.వి. రమణ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేటపాలెం గ్రామానికి చెందిన సైకం మస్తాన్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన కుమార్తె శ్రావణి (3) విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్ 1 వద్ద కనబడటం లేదని ఫిర్యాదు చేశాడు. రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించారని చెప్పినా, సమాధానాలు పొంతనలేకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
తక్షణమే జిఆర్పి, ఆర్పీఎఫ్ బృందాలు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, ఒక మహిళ, ఒక పురుషుడు కలిసి ఆ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు గుర్తించారు. అనంతరం బస్టాండ్ సీసీటీవీ చిత్రాల్లో, ఆ ఇద్దరూ శ్రావణిని తీసుకుని విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులో ఎక్కినట్టు తేలింది. బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేయగా, రాజమండ్రి జిఆర్పి పోలీసులు వారి వద్ద నుంచి పాపను సురక్షితంగా రక్షించి, ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.
తదుపరి దర్యాప్తులో పాప తల్లి సైకం వెంకటేశ్వరమ్మ పోలీసులకు షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తన భర్త మస్తాన్ నాలుగు నెలలుగా ఇంటికి దూరంగా ఉంటూ, రెండు రోజుల క్రితం తన దగ్గర నుండి శ్రావణిని అపహరించాడని తెలిపింది. విచారణలో మస్తాన్ తన కూతురిని బిక్షాటన కోసం 5 వేల రూపాయలకు ఆ ఇద్దరు నిందితులకు విక్రయించినట్లు ఒప్పుకున్నాడు.
గతంలో కూడా ఇదే వ్యక్తి తన మూడో కుమార్తెను వేటపాలెంలోనే మరొకరికి అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.