Mahesh Kumar Goud | కేసీఆర్ కు సిట్ నోటీసులపై…

Mahesh Kumar Goud | కేసీఆర్ కు సిట్ నోటీసులపై…
- మహేష్ కుమార్ గౌడ్ స్పందన
Mahesh Kumar Goud | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది నిగ్గు తేలాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నందినగర్ లోని తన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం వయస్సును దృష్టిలో ఉంచుకొని వారు కోరిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ పారదర్శకంగా సాగుతోందన్నారు. ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందని, అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ట్యాపింగ్ ఉదంతంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది నిగ్గు తేలాల్సి ఉందన్నారు. అధికారుల ప్రమేయం మాత్రమే కాకుండా, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
